sampurnes Babu
-
సంపూర్ణేష్ బాబుకు గోల్డెన్ ఛాన్స్.. ఈ సినిమాతో అక్కడ ఎంట్రీ షురూ
టాలీవుడ్లో నటుడు సంపూర్ణేష్ బాబు, స్పూఫ్ అంశంతో కూడిన చిత్రాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ, కడుపుబ్బ నవ్విస్తాడు. కోలీవుడ్‌లో ఆయనకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈయన ప్రస్తుతం తంగముట్టై అనే చిత్రం ద్వారా తమిళ తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూ నార్మల్ ఫిలిం ఫ్యాక్టరీ తరఫున కేఎం ఇలంజెళియన్, జియో స్టార్ ఎంటర్ప్రైజెస్ నేతృత్వంలో ఎం.కోటీశ్వరర్ రాజూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగులోనూ బంగారుగుడ్డు పేరుతో రూపొందుతోంది. ఇందులో రోబోశంకర్, శరన్‌రాజ్, త్వాసీమోహన్, సురేఖవాణి ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. సమీపర్ టాన్టన్ సంగీతాన్ని సమకూర్చగా, గోపినాథ్ నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ సంపూర్ణేష్ బాబు తెలుగులో హాస్య కథా చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రంలో హాస్యంతో పాటు సీరియస్ రోల్ చేశారు. తంగముట్టై చిత్రంలో సంపూ దొంగతనం చేయడం తెలియని దురదృష్ట దొంగ పాత్రలో నటించారు. అకస్మాత్తుగా అతనికి ఒక బంగారు గుడ్డు దొరికితే ఎలా ఉంటుంది అనేది చిత్ర కథాంశం. ద్విభాషా చిత్రం కావడంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చిత్ర షూటింగ్ నిర్వహించారు. ఇది కళ్లల్లో నీళ్లు తిరిగేలా నవ్వించే సినిమా అయినప్పటికీ ఈ సనిమాలో ముఖ్యమైన మెసేజ్ ఉంటుంది. ఇది ప్రేక్షకులందరినీ ఆలోచింపచేస్తుంది. ఈ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను సంపూర్ణేష్ బాబు తప్పకుండా మెప్పిస్తాడని అందరూ కామెంట్లు చేస్తున్నారు. -
ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్ రొనాల్డ్ సన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రోనాల్డ్ సన్ మాట్లాడుతూ– ‘‘హృదయకాలేయం’ విడుదల సమయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఎవరీ హీరో.. మార్కెట్ అవుతుందా? అనే ప్రశ్నలతో వ్యాపారం మందకొడిగా సాగింది. విడుదల తర్వాత ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ‘బాహుబలి’ తరహాలో ఐదేళ్లు తీశాం. ప్రమోషన్లో భాగంగా ఒక్కో ట్రైలర్ విడుదల చేయగా సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో ఆ నలుగురు వల్లే మా చిత్రం నిలబడింది. గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా మా చిత్రం విడుదలకాబోతుంది. నైజాంలో ‘దిల్’ రాజుగారు విడుదల చేస్తున్నారు. ఆ నలుగురు లేనిదే ‘కొబ్బరిమట్ట’ లేదు. కథ బాగుంటే విడుదలకు సహకరిస్తారనేందుకు మా చిత్రమే నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించాను. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ , రొమాన్స్, సందేశం.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. ‘‘నాలుగేళ్ల ప్రయాణం మా చిత్రం. గీతా ఆర్ట్స్ సహకారంతో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా సినిమాకి ఇప్పటికే టికెట్స్ బుకింగ్ 80శాతం పూర్తయ్యాయి’’ అన్నారు సాయిరాజేష్. నిర్మాత ఎస్కె.ఎన్, కత్తి మహేష్, ఏలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సంపూ రికార్డ్
‘హుృదయకాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచి, ‘బర్నింగ్ స్టార్’గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్ రొనాల్డ్ సన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా – ‘‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట’’ అంటూ పెద్ద డైలాగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ‘‘ఏరా పెదరాయుడు.. త్రికాలాత్రక.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూర్ణేష్ డైలాగ్.. ‘పెదరాయుడు టైమ్ ఈజ్ ఓవర్.. ఆండ్రాయుడు టైమ్ స్టార్ట్స్ నౌ..’ అనే డైలాగ్‌తో ముగుస్తుంది.3.30 నిమిషాలపాటు సంపూ చెప్పిన ఈ డైలాగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు.. లాంటి మూడు పాత్రలతో సంపూ మెప్పించబోతున్నారు. అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని నెలకొల్పాడు. ఇటీవల విడుదల చేసిన ‘అఆ.. ఇఈ...’ అనే పాటకి యూట్యూబ్‌లో 24 గంటల్లో రెండు లక్షల వ్యూస్ వచ్చాయంటే మా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలియజేస్తోంది. ఈ చిత్రం నైజాం, ఓవర్సీస్ హక్కులని ‘నో బారియర్స్ ఎంటర్టైన్మెంట్’ వారు సొంతం చేసుకున్నారు’’ అన్నారు. -
ఒక్కరు కాదు ముగ్గురు
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఇషికా సింగ్, గీతాంజలి కథానాయికలు. ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతోంది. ఈ చిత్రం సాంగ్ టీజర్‌ను ‘బిగ్ బాస్ 1’ కంటెస్టెంట్ల మధ్య హైదరాబాద్‌లో విడుదల చేశారు. డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సంపూర్ణేష్ని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్లుంటారు’’ అన్నారు. ‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ రోజున సంపూర్ణేష్‌బాబు, సాయిరాజేశ్‌తో ‘సంపూ ఇన్ అమెరికా’ అని ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణారావు.‘‘హృదయ కాలేయం’ సినిమా టైమ్‌లో మేం ఎదగాలని అందరూ సపోర్ట్ చేశారు. అయితే ‘కొబ్బరిమట్ట’ చిత్రానికి మూడేళ్ల పాటు చాలా సమస్యలు ఎదుర్కొని అధిగమించాం’’ అన్నారు నిర్మాత సాయి రాజేష్. ‘‘మిట్టపల్లె అనే చిన్న ఊరు నుంచి నన్ను తీసుకొచ్చి రాజేష్ అన్న ‘హృదయ కాలేయం’ సినిమా చేశాడు. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ సినిమాకి కూడా తనే నిర్మాత. ఆయన వెనక నిలబడి ఎన్ని రోజులైనా సపోర్ట్ అందిస్తాను’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. భరత్, అజయ్, కత్తి కార్తీక, సమీర్, ముమైత్ ఖాన్, మధుప్రియ, రైటర్ కిట్టు, అనురాగ్, సౌమ్య వేణుగోపాల్, శ్రవణ్, సాయిబాలాజీ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీ వనం విశాఖపట్నం
ప్రత్యేక హోదా గళాలపై పోలీసుల ఉక్కుపాదం నగరంలో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరం ఖాకీల పదఘట్టనలతో హోరెత్తిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు గురువారం నగరాన్ని దిగ్బంధించారు. అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ సామాన్యులను ఆంక్షలతో భయభ్రాంతులకు గురిచేశారు. నగరంలో అడుగడుగునా కర్ఫ్యూ వాతావరణమే కనిపించింది. ప్రత్యేక హోదా కోసం నినదించిన గళాలను కర్కశంగా అణగదొక్కారు. కనిపించినవారినల్లా అదుపులోకి తీసుకున్నారు. బస్సులు, ఆటోలు, టాక్సీలే కాదు.. వ్యక్తిగత వాహనాల్లో వస్తున్న వారిని సైతం వదిలి పెట్టలేదు. చంటి పిల్లలతో వెళ్తున్న మహిళలను కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లారు. స్టేషన్లకు తరలించారు. పర్యాటక ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు. జాతీయ జెండా పట్టుకున్నా నేరమే! గణతంత్ర దినోత్సవం రోజున యువత జాతీయ జెండాలు పట్టుకొని విశాఖ వీధుల్లో తిరగడమే నేరమైంది. జాతీయ జెండా పట్టుకున్న పాపానికి విద్యార్థులు, యువకులకు పోలీసులు తరిమి కొట్టారు. సంపూర్ణేష్‌బాబు, తమ్మారెడ్డి అరెస్ట్ ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్, సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు, నిర్మాత తిలక్ తదితరులు యువతకు మద్దతు తెలిపేందుకు విశాఖ వచ్చారు. వుడా పార్కు వద్ద తొలుత వీరిని పోలీసులు అడ్డుకోగా.. పార్కు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. -
హాట్ స్టార్‌తో సంపూ
సెటైరికల్ డైలాగులతో సంపూర్నేష్ బాబు సునామీలా దూసుకొచ్చిన ‘సింగం 123’ విడుదలై ఏడాదిపైనే అయ్యింది. ఆ సినిమా తర్వాత ‘కొబ్బరిమట్ట’లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో హాట్ స్టార్ పూనమ్ పాండే ప్రధాన పాత్రధారిగా ఫకృద్దీన్ ఖాన్, విజయ్‌భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో సంపూ అతిథి పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో సంపూ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ నెలాఖరున ముంబైలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఆనెం వెంకటరావు. -
వినోదం సంపూర్ణం
విజయ్‌భరత్, అశ్విని, కాంచన ముఖ్య తారలుగా శ్రీరామ్మూర్తి దర్శకత్వంలో పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘వినోదం 100%’. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదం అందించాలనే ఆకాంక్షతో ఈ చిత్రం చేశాం. పోసాని కృష్ణమురళి, సంపూర్ణేశ్‌బాబు, పృథ్వీ పాత్రలు చాలా బాగుంటాయి. వాళ్ల నటన, కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: జయకుమార్, మాటలు: అంజన్. కెమెరా: మల్లికార్జున్, ఎడిటింగ్: రాంబాబు. -
సింగంగా సంపూ
మంచు విష్ణు... తన కుటుంబ కథానాయకులతో కాకుండా తొలిసారి బయట హీరోతో సినిమాను నిర్మించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు. ‘హృదయకాలేయం’తో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్‌బాబు. సినిమా పేరు ‘సింగం 123’. అక్షత్‌శర్మ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సంపూ అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకులకు నచ్చేలా ‘సింగం 123’ ఉంటుందని, ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఇందులో యాక్షన్, కామెడీ అంశాలుంటాయని దర్శకుడు చెప్పారు. ‘సింగం 123’గా సంపూ ఎలా ఉంటారో తెలియజేయడానికి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశామని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపారు.