ఏమిటీ కక్ష!
Published Thu, May 25 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : దేవాదాయ శాఖలో పని చేస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఇటీవల ఆలయ ఉద్యోగులను ఏకపక్షంగా బదిలీ చేసి విమర్శలు మూటగట్టుకున్న ప్రభుత్వం.. తాజాగా మేనేజర్లను తక్కువ ఆదాయం వచ్చే ఆలయాలకు బదిలీచేసి వారికి జీతాలు కూడా అందని పరిస్థితి కల్పించింది. దీంతో ఆలయాల మేనేజర్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఉన్నతాధికారులు మేనేజర్లను వారి మాతృసంస్థకు బదిలీ చేయాలని, మేనేజర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆ శాఖ ప్రిపల్ కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ మంగళవారం 604248 నంబర్‌తో మెమో జారీ చేశారు. దీంతో అవాక్కవడం మేనేజర్ల వంతయ్యింది.
2001 నుంచి మేనేజర్లుగా..
గతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సుమారు 30 ఆలయాలను ఒకే కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించాల్సి వచ్చేది. దీంతో 2001లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి దివంగత దండు శివరామరాజు అర్హత గల సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను మేనేజర్లుగా నియమించి.. వారికి కొన్ని ఆలయాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,250 మంది మేనేజర్లుగా బాధ్యతలు స్వీకరించారు. కాలక్రమంలో వారిలో కొందరు కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతి పొందగా, ప్రస్తుతం విభజిత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 86 మంది మేనేజర్లు పనిచేస్తున్నారు.
హోదా తగ్గించడంతో జీతాలు రాని పరిస్థితి
సుమారు 16 సంవత్సరాల నుంచి మేనేజర్లుగా పని చేస్తున్న వారిని వెనక్కి పంపుతూ మెమో విడుదల చేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మేనేజర్ల స్థాయి నుంచి తిరిగి గుమాస్తాల స్థాయికి హోదాను తగ్గించడంతో వారు మాతృ సంస్థకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. వారి మాతృ సంస్థలు తక్కువ ఆదాయం పొందుతుండటంతో జీతాలు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని మేనేజర్లు వాపోతున్నారు. దీనికితోడు ఇప్పటివరకూ పదోన్నతుల జాబితాలో ఉన్న తామంతా కార్యనిర్వహణాధికారులుగా ఎదిగే అవకాశం పోతుందని ఆవేదన చెందుతున్నారు.
ఉద్యోగాలు ఉంటాయో.. లేదో
మేనేజర్లను రివర్ట్ చేస్తూ జారీ చేసిన మెమో అమల్లోకి వస్తే సంబంధిత మేనేజర్లు వారి మాతృ సంస్థలకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటివరకూ ఆయా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు తమ కొలువులు రెగ్యులర్ అవుతాయని భావిస్తుండగా.. వారంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముంది.
Advertisement
Advertisement