అంతులేని నిర్లక్ష్యం
- పెద్దాస్పత్రిలో వైద్యసేవలు మృగ్యం
- ఈఎన్‌టీ విభాగంలో హౌస్‌సర్జన్ల తీరుతో రోగుల అవస్థలు
- ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
అనంతపురం మెడికల్ : పేదోడికి జబ్బు చేస్తే వచ్చేది ప్రభుత్వ ఆస్పత్రికే. అదీ జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రికయితే రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యంతో మెరుగైన వైద్యం మేడిపండు చందంగా మారుతోంది. హౌస్‌సర్జన్ల తీరయితే మరీ ఘోరం. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వైద్యంపై పట్టుపెంచుకోవాల్సిన వీరికి కనీసం రోగులను పట్టించుకునే ఓపికే ఉండదు. ప్రధానంగా సర్వజనాస్పత్రిలోని చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) విభాగంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోగులు నరకం అనుభవిస్తున్నారు.
అటు ఈఎన్‌టీ వార్డుతో పాటు ఓపీ (ఔట్ పేషెంట్స్) గదిలోనూ గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో రోజూ వంద మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. వార్డు, థియేటర్, డ్రస్సింగ్, ఓపీ సేవల కోసం ప్రత్యేకంగా నలుగురు హౌస్‌సర్జన్లను కేటాయించారు. ఇక్కడి డాక్టర్లే సరిగా విధులు నిర్వర్తించని పరిస్థితి నెలకొని ఉండటంతో వారు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మంగళవారం పెద్ద సంఖ్యలో రోగులు ఓపీ చూపించుకుని డ్రస్సింగ్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఓ మహిళా హౌస్‌సర్జన్ అయితే రోగులు నిరీక్షిస్తున్నట్లు గమనించినా అస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈమెను చూసిన కొందరు డ్రస్సింగ్ కోసం వచ్చామని, చూడాలని కోరినా విన్పించుకోకుండా డాక్టర్లున్న గదిలోకి వెళ్లి కబుర్లు చెప్పుకోవడం కన్పించింది. ఈఎన్‌టీ విభాగంలోనే సెమినార్ గది ఉంది.
వైద్య విద్యార్థులకు ఈ విభాగపు సేవలపై వివరించాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా నిర్లక్ష్యమే. గంటల తరబడి ఓపీ బయటకే విద్యార్థులు గుమిగూడి ఉన్నారు. ఇదే సమయంలో ‘సాక్షి’ ఫొటోలు తీయడాన్ని గమనించి వారందరినీ సెమినార్ గదిలోకి పంపారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలను డాక్టర్లు చేయాల్సి ఉంటుంది. మంగళవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చినా సుమారు గంట పాటు వారిని పట్టించున్న వారే లేరు. వార్డులోనూ మధ్యాహ్నం తర్వాత రోగులను పట్టించుకునే వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
సెలవులో విభాగాధిపతి
ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ నవీద్ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరు పర్యవేక్షించే వారు కరువయ్యారు. కొందరు డాక్టర్లు మధ్యాహ్నానికి ఇంటి ముఖం పట్టి.. సాయంత్రం బయోమెట్రిక్ కోసం మాత్రమే వస్తున్నారు.
పట్టించుకునే వారే లేరయ్యా : వెంకటేశ్, అనంతపురం
నాకు చెవి నొప్పి ఎక్కువగా ఉంది. పొద్దున్నే ఇక్కడికొచ్చి డాక్టర్లతో చూపించుకున్నా. చెవిలో క్లీన్ చేయాలని చెప్పారు. డ్రస్సింగ్ చేసే గది వద్దకు వెళితే ఎవరూ లేరు. గంటన్నర నుంచి ఈడే ఉన్నా. ఓ డాక్టరమ్మ వచ్చినా అటే వెళ్లిపోయింది. పలకరిస్తున్నా పట్టించుకోలేదు. బయట డబ్బులు పెట్టుకోలేకే కదయ్యా ఇక్కడికొచ్చేది.