సీజ్ చేసిన వైన్ షాపు
- భద్రాచలంలో అనధికార నిల్వలు స్వాధీనం
- మద్యం దుకాణం సీజ్
భద్రాచలం : ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాష్ట్రస్థాయి అధికారులు భద్రాచలంలో మంగళవారం రాత్రి దాడులు చేశారు. ఐటీడీఏ రోడ్‌లోగల సాయి తిరుమల వైన్ షాపు పక్కనున్న గదిలో ఎటువంటి అనుమతుల్లేకుండా భారీగా మద్యం నిల్వలను అధికారులు గుర్తించి, స్వాధీనపర్చుకున్నారు. ఆ వైన్ షాపును సీజ్ చేశారు. భద్రాచలంలోని మద్యం దుకాణాదారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యాన్ని పెద్దఎత్తున అక్రమంగా నిల్వలు చేయడంతోపాటు కల్తీ కూడా చేస్తున్నారని అందిన ఫిర్యాదులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ దాడులు చేశారు. సాయి తిరుమల వైన్ షాపు పక్కనున్న గదిని సిండికేట్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నట్టు సమాచారం. అక్కడున్న అక్రమ నిల్వలను వాహనంలో స్థానిక ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులపై స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. భద్రాచలంలోని మద్యం దుకాణదారులంతా సిండికేట్‌గా ఏర్పడి, మద్యం నిల్వలను కూడా ఒకేచోట నుంచి సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోని మిగతా మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలను నిలిపివేశారు.
కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో సాయి తిరుమల వైన్ షాపుపై గతంలో కూడా అధికారులు దాడులు చేశారు. కల్తీ మద్యంగా భావించిన సీసాలను పరీక్షలకు కూడా పంపించారు. ఆ తరువాత దానిపై ఎటువంటి పురోగతి లేదు. ఇదే దుకాణంపై అధికారులు మంగళవారం దాడులు జరిపి సీజ్ చేశారు.