యువ ఇంజినీర్ దుర్మరణం
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు జేఆర్‌పేటకు చెందిన పోతల శ్రీకాంత్ (22) అనే యువ ఇంజనీరు సర్టిఫికెట్ల కోసం తాను చదివిన పంజాబ్‌లోని కళాశాలకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
-
పంజాబ్‌లో ఆత్మకూరు యువకుడి విషాదం
-
శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు జేఆర్‌పేటకు చెందిన పోతల శ్రీకాంత్ (22) అనే యువ ఇంజనీరు సర్టిఫికెట్ల కోసం తాను చదివిన పంజాబ్‌లోని కళాశాలకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పట్టణంలోని జేఆర్‌పేటకు చెందిన పోతల శీనయ్య తన ఇద్దరు కుమారులను ఇంజనీరింగ్ చదివించాడు. రెండో కుమారుడు శ్రీకాంత్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని లవ్లీ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది ఇంజినీరింగ్ çపూర్తి చేశాడు. ఇటీవల బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు కోసం నాలుగు రోజుల క్రితం జలంధర్‌కు వెళ్లాడు. అయితే మంగళవారం ఉదయం అతని తండ్రికి శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫోన్ వచ్చింది. శ్రీకాంత్, అతని మిత్రులు కలసి సోమవారం పిక్నెక్‌కు వెళ్లగా, అక్కడ జరిగిన కారు ప్రమాదంలో శ్రీకాంత్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే కారులో ప్రయాణించిన మరెవ్వరికి గాయాలు లేకపోవడం, మృతి చెందిన శ్రీకాంత్ తల వెనుక భాగంలో బలమైన గాయం మాత్రమే తగిలి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చేతికి అందివచ్చిన శ్రీకాంత్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. గతేడాది శ్రీకాంత్ తల్లి సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శ్రీకాంత్ మృతదేహాన్ని గురువారం ఆత్మకూరుకు తీసుకురానున్నారు.