చింతకొమ్మదిన్నె: వారు తమ స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. మరో మూడు నిమిషాల్లో కల్యాణ మండపం వద్దకు చేరుకోవాల్సిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంట తీసుకెళ్లింది. సుదూర ప్రయాణం.. నిద్రమత్తు.. అలసట.. వేగం.. అన్నీ కలిపి ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఎదురుగా వస్తున్న లారీని ఒక్క సారిగా ఢీ కొనడంతో ఇరువురు స్నేహితులు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించి పోయారు. వివరాల్లోకి వెళితే... కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని క్విన్‌టాల్స్‌ఫాంకో విజిలెన్స్ అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న ప్రతీక్ (27 ఉత్తర ప్రదేశ్), అమృత్ ( 27, హైదరాబాదు), రవితేజ (27, రాజమండ్రి), సంతోష్ ( 27 తిరుపతి)లు కడప నగరంలోని తన స్నేహితుని వివాహానికి బెంగళూరు నుంచి కెఎ03 ఏసీ 1500 నెంబరు గల కారులో బయలుదేరారు. కల్యాణ మండపానికి మరో కిలోమీటరు దూరంలో ఉన్న ఊటుకూరులోని కృషి విజ్జాన కేంద్రం వద్దకు రాగానే ఉదయం 6.30 నిమిషాలకు కడప వైపు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న టిఎన్ 37 సికె 3205 నెంబరు గల లారీని వీరి కారు వేగంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రతీక్ అక్కడికక్కడే మృతి చెందగా, అమృత్, రవితేజ, సంతోష్‌లు కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు కారు తలుపులను పగులగొట్టి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని 108 సహాయంతో రిమ్స్‌కు తర లించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ అమృత్ తుది శ్వాస విడిచాడు. రవితేజ, సంతోష్‌లు చికిత్స పొందుతున్నారు. ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించడంతో వాహన రాకపోకలు 30 నిమిషాల పాటు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ చాంద్‌బాషా, తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజనీర్లు దుర్మరణం
Published Fri, Oct 21 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
Advertisement
Advertisement