
మృత్యువులోనూ వీడని స్నేహం
ఓ ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. మేడ్చల్ పట్టణ శివారులో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
♦ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
♦ మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై ఘటన
♦ బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం
♦ మద్యం మత్తులో డ్రైవర్..?
మేడ్చల్: ఓ ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. మేడ్చల్ పట్టణ శివారులో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం కాళ్లకల్‌కు చెందిన ఎంకినోళ్ళ సాయికుమార్(19) తన కుటుంబంతో కలిసి మేడ్చల్ కిందిబస్తీలో నివాసముంటున్నాడు. బిహార్‌కు చెందిన సిపూన్(22) కాళ్లకల్‌లోని ఓ కంపెనీలో పనిచేసుకుంటూ అదే బస్తీలో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం స్నేహితులు బైక్‌పై బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై మేడ్చల్ నుంచి చెక్‌పోస్టుకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఇసుకబావి వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ కంపెనీ ఉద్యోగులను నగరానికి తీసుకెళుతున్న ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో సిపూన్, సాయికుమార్ రోడ్డుపై పడిపోయారు. సాయికుమార్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాయపడిన సిపూన్‌ను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా నడిపాడని అతడిని అదుపులోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో వాహనం నడిపి ఉండొచ్చనే అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపినట్లు సీఐ తెలిపారు. అయితే, ఇంటర్ పూర్తి చేసిన సాయికుమార్ పాలీటెక్నిక్‌లో చేరే ప్రయత్నంలో ఉన్నాడు. అతడికి ఓ సోదరుడు ఉన్నాడు. సిపూన్ బిహార్ నుంచి ఒంటరిగా వలస వచ్చి కార్మికుడిగా జీవనం సాగిస్తుండేవాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.