
ఎర్రగుంట్ల ఎస్‌ఐ సస్పెన్షన్
ఎర్రగుంట్ల/కడప అర్బన్ : ఎర్రగుంట్ల ఎస్‌ఐ సి.లక్ష్మినారాయణను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కృష్ణా పుష్కరాల సందర్భంగా ఉన్నతాధికారులంతా బందోబస్తు విధుల్లో నిమగ్నమైన సమయంలో.. మట్కా నిర్వాహకుడు జిలానీ వద్ద ఆయన రూ. 2 లక్షలు తీసుకుని విచ్చలవిడిగా మట్కా నిర్వహించుకునేందుకు సహకరించినట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. కొంత కాలంగా మట్కా నిర్వహణ ఆపిన జిలానీని తిరిగి నిర్వహించుకోవాలని ఎస్‌ఐ సూచించినట్లు సమాచారం. అందుకు గాను రూ. 2 లక్షలు వసూలు చేసినట్లు పక్కా ఆధారాలు లభించడంతో లక్ష్మినారాయణను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. అంతేగాక ప్రతి నెల రూ. 1.20 లక్షలు ఇచ్చేలా జిలానీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదంతోపాటు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే.. పక్కా ఆధారాలు ఉంటే పోలీసు, సిబ్బంది ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రతి కేసులోనూ కక్కుర్తి:
కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల ఎస్‌ఐగా పని చేసిన లక్ష్మినారాయణ ప్రతి కేసులోనూ కాసుల కోసం కక్కుర్తి పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుస్టేషన్‌లో వాహనాలకు డీజిల్ పట్టించాలని పెట్రోలు బంకుల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఏదైనా కేసు వస్తే ఎటువైపు వారి నుంచైనా డబ్బులు తీసుకుని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరినైనా సరే తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తారు. హనుమనగుత్తిలో టీడీపీ వారికి అనుకూలంగా వ్యవహరించి సివిల్ పంచాయితీలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. ఓ మైనింగ్ కేంద్రంలో ట్రాక్టర్ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఆ కేసును తారుమారు చేసేందుకు మైన్స్ యజమానులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.