రైతు బతుకు మార్చేందుకే..
♦ సమన్వయ సమితులతో సంఘటితం చేస్తాం
♦ దుర్భర జీవితానికి స్వస్తి పలుకుదాం
♦ అన్నదాతలు అప్పులిచ్చే స్థాయికి ఎదగాలి
♦ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
దమ్మపేట :
‘గ్రామస్థాయిలో సర్పంచ్ మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి.. ఇలా అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. కానీ అరకపట్టి వ్యవసాయం చేసే రైతుల బతుకులు మారటం లేదు.. ఇంకా ఎన్నాళ్లు ఇలా దుర్భర జీవనం గడపాలి.. దీనికి స్వస్తి చెప్పటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ కర్మాగారం ఆవరణలో సోమవారం నిర్వహించిన రైతు సమన్వయ సమితుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేసే పరిస్థితులు ఇక ఉండవని, రైతు సమన్వయ సమితులే రైతులకు అప్పులిస్తాయని అన్నారు. రైతు సమితులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. స్వయంగా పంటలు పండించే రైతులనే ఈ సమితుల్లో సభ్యులుగా ఎంపిక చేశామని చెప్పారు. రైతు సమన్వయ సమితుల సభ్యులంతా ప్రభుత్వంలో భాగస్వాములేనని పేర్కొన్నారు. గత పాలకులు పట్టణాల్లో ఆటోలు నడిపే వారిని, పల్లెల్లో బడ్డీకొట్లు నిర్వహించేవారిని ఆదర్శ రైతులుగా నియమించి పెత్తనం చెలాయించారని, ఆదర్శరైతు వ్యవస్థ ఏమైందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా, సమాజంలో తలెత్తుకుని తిరిగేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఇంతకాలం రైతులు సంఘటితంగా లేకపోవడం వల్లే పంటలకు మద్దతు ధర పొందలేకపోయారని, ఇప్పుడు అందరినీ ఐక్యం చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని వివరించారు.
రాష్ట్రంలో 1.10 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణాధికారులను (ఏఈఓ) నియమించినట్లు తెలిపారు. ఒక్కో రైతు సమన్వయ సమితికి రూ.15 లక్షలతో సొంత భవనం నిర్మిస్తామని, అందులోనే రైతు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. భూసార పరీక్షలు చేసుకుని నివేదిక ఆధారంగా ఎరువులు వాడుతూ నూతన విత్తనాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని పిలుపు నిచ్చారు.
రానున్న ఖరీఫ్ సీజన్‌కు రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలోనే ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు యాంత్రీకరణ వ్యవసాయం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి రూ. 500 కోట్ల ప్రత్యేక నిధిని ఇచ్చి తెలంగాణలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసుకుంటే అక్కడ సమితి ఆధ్వర్యంలో కొనుగోలు చేయిస్తామన్నారు.
రైతు సంతోషంగా లేకుంటే పతనమే..
రైతు బాగుంటేనే గ్రామీణ వ్యవస్థ బాగుంటుందని, రైతు సంతోషంగా లేకపోతే వ్యవస్థే పతనం అవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే మిగిలిన రంగాలు కూడా పురోగతి సాధిస్తాయని అన్నారు.
రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయిస్తోందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు కేటాయించామని, గోదావరి కాలువ ద్వారా ములకలపల్లి మండలం కమలాపురం వద్దకు తీసుకొచ్చి అక్కడి నుంచి లిప్ట్ ద్వారా మల్లెపూల వాగుకు గోదావరి జలాలను ప్రవహింపజేస్తామని తెలిపారు. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆయిల్‌ఫెడ్ సమావేశం త్వరలో ఢిల్లీలో జరగబోతోందని, ఈ సమావేశంలో పామాయిల్ టన్నుధర రూ 10 వేలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ది సంస్థ చైర్మన్ బుడాన్‌బేగ్, వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాధ్, వ్యవసాయశాఖ జేడీ పి. ప్రతాప్, ఏడీ అఫ్జల్‌బేగం, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ పైడి వెంకటేశ్వరరావు, జిల్లా సమితి సభ్యుడు దారా యుగంధర్, ఏఎంసీ చైర్మన్ తానం లక్ష్మీ, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు పాల్గొన్నారు.