సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..! | Sarpanch To MLA In Nizamabad District | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!

Published Tue, Nov 13 2018 2:37 PM | Last Updated on Tue, Nov 13 2018 2:40 PM

Sarpanch To MLA In Nizamabad District - Sakshi

సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ‘ఇంట గెలిచి బయట గెలవాలి’ అన్నట్లుగానే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చాలా మంది మాజీ శాసన సభ్యులు గ్రామస్థాయి రాజకీయాల్లోనే ఓనమాలు దిద్ది శాసనసభలో అడుగుపెట్టారు. గ్రామ స్థాయిలో రాజకీయంగా వారు వేసిన అడుగులే వారిని శాసనసభకు ఎంపికయ్యేలా చేశాయి. వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ సమితి అధ్యక్షులు, సహకార సంఘాల చైర్మన్లుగా పని చేసిన నాయకులెందరో శాసనసభలో అడుగుపెట్టారు. ఆయా నాయకుల గురించి మీకోసం ప్రత్యేక కథనం.. 

ఎల్లారెడ్డి నియోజకవర్గం

 లింగంపేట మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ మంత్రి తాడూరి బాలాగౌడ్‌ మొదట ఎల్లారెడ్డి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బాలాగౌడ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి కేబినేట్‌లో చక్కెర పరిశ్రమ, రోడ్లు–భవనాల శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ఎమ్మెల్యే పదవి ముగిసిన అనంతరం బాలాగౌడ్‌ నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984, 1989 నిజామాబాద్‌ పార్లమెంట్‌ వరుస ఎన్నికల్లో పోటీ చేసి రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు.

 
 లింగంపేట మండలం లోంకలపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డిగారి కిషన్‌రెడ్డి 15 ఏళ్ల పాటు గ్రామ సర్పంచ్‌గా కొనసాగారు. సుమారు 17 సంవత్సరాలు సొసైటీ చైర్మన్‌గా కొనసాగారు. ఇదే సమయంలో ఏడేళ్ల పాటు డీసీసీబీ డైరెక్టర్‌గా పని చేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌ గ్రామానికి చెందిన యెర్వ శ్రీనివాస్‌రెడ్డి తాండూర్‌ గ్రామ సర్పంచ్‌ పదవిలో కొనసాగుతున్న సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్‌ అర్ధంతరంగా రద్దు చేశారు. దీంతో తాండూర్‌ సర్పంచ్‌గా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ తరఫున ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 
 గాంధారికి చెందిన నేరేళ్ల ఆంజనేయులు తొలుత 1981లో ఎల్లారెడ్డి పంచాయతీ సమితి కో–ఆప్షన్‌ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1987లో ఆయన గాంధారి సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1988లో గాంధారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1989లో ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994, 1998లలో వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి ఎల్లారెడ్డి చరిత్రలో హ్యాట్రిక్‌ సాధించిన నేతగా గుర్తింపు పొందారు.  నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన బి.జనార్ధన్‌గౌడ్‌ 1987లో ధర్మారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 2007లో తాండూర్‌ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన ఆయన 2008లో ఎల్లారెడ్డి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నిజామాబాద్‌ రూరల్‌

ప్రస్తుత ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా స్థానిక సంస్థల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మాక్లూర్‌ ఎంపీపీగా పని చేసిన ఆమె.. 2008లో అప్పటి డిచ్‌పల్లి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రాజకీయ ప్రాస్త నం ప్రారంభమైంది కూడా స్థానిక సంస్థల నుంచే. 1881లో సిరికొండ మండ లం చీమన్‌పల్లి సర్పంచ్‌గా బాజిరెడ్డి ఎన్నికయ్యారు. 1987లో కాంగ్రెస్‌ తరఫున సిరికొండ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా, 1995లో స్వతంత్య్ర అభ్యర్థిగా మండల పరిషత్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004లో బాజిరెడ్డి కాంగ్రెస్‌ తరఫున బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కామారెడ్డి నియోజకవర్గం..

కామారెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన విఠల్‌రెడ్డిగారి వెంకట్రాంరెడ్డి సుమారు 25 ఏళ్ల పాటు గ్రామ సర్పంచ్‌గా కొనసాగారు. 1952, 1957లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఉమ్మడి నియోజకవర్గంలో అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్న కామారెడ్డి స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి. అంతకు ముందు మధుసూదన్‌రెడ్డి అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా, సర్పంచ్‌గా, సింగిల్‌ విండో చైర్మన్‌గా పని చేశారు.1972లో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వై.సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నల్గొండ జిల్లాకు చెందిన ఈయన యుక్త వయసులో హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. మొదట సత్యనారాయణ తెలంగాణ ఫిషర్‌మెన్‌గా, సెంట్రల్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పని చేశారు. చట్టసభల్లో మత్స్యకారులకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో గంగపుత్రుడైన సత్యనారాయణకు కాంగ్రెస్‌ టికెట్‌ లభించింది. 1978లో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బ్రహ్మణపల్లి బాలయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాలయ్య అంతకు ముందు కామారెడ్డి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా కొనసాగారు.1983లో జరిగిన ఎన్నికల్లో సైకిల్‌ గు ర్తుపై పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలుపొందిన పార్శి గంగయ్య తొలుత కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి సర్పంచ్‌గా కొనసాగారు. వ్యాపారరీత్యా కామారెడ్డి లో స్థిరపడిన ఆయన ఆ తర్వాత కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. 

బాన్సువాడ నియోజకవర్గం

1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కత్తెర గంగాధర్‌ 1984–1989 వరకు బాన్స్‌వాడ ఎంపీపీగా కొనసాగారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1978లో దేశాయిపేట సొసైటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 1981లో ఎల్‌ఎంబీ డైరెక్టర్‌గా, 1987లో డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు.

ఆర్మూర్‌ నియోజకవర్గం 

1985లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏలేటి మహిపాల్‌రెడ్డి ఆయన స్వగ్రామమైన కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లి సర్పంచ్‌గా పని చేశారు. అలాగే, భీమ్‌గల్‌ పంచాయతీ సమితి సభ్యులుగా కొనసాగారు. అనంతరం టీడీపీ అభ్యర్థిగా ఆర్మూర్‌ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి, మంత్రి అయ్యారు. 1978, 1983, 1989 ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన శనిగరం సంతోష్‌రెడ్డి రాజకీయ ప్రస్తానం కూడా స్థానిక సంస్థల నుంచే ప్రారంభమైంది. ఆయన 2001లో భీమ్‌గల్‌ జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్నప్పుడే 2004లో జరిగిన ఎన్నికలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement