మంత్రిని నిలదీస్తున్న వరదాపురం సూరి (ఎడమ)
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఫైర్ అయ్యారు.
► హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, హెచ్చెల్సీ సమీక్షలో రగడ
► మంత్రి పల్లెను నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం
అనంతపురం టౌన్ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఫైర్ అయ్యారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) హాలులో హంద్రీ–నీవా సుజల స్రవంతి, హెచ్చెల్సీపై కలెక్టర్ శశిధర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ విషయం తెలుసుకుని సూరి గంట ఆలస్యంగా ఎమ్మెల్సీ కేశవ్‌తో కలిసి అక్కడకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోతే ఎలాగని మంత్రిని ప్రశ్నించారు. సమావేశం ఉందని అధికారులు కూడా తెలపకపోవడమేంటని ఆగ్రహించారు. మీకు మీరే మీటింగులు పెట్టుకుంటే ఇక మేమెందుకంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇంతలో కేశవ్ కల్పించుకుని కనీసం అజెండా ఏంటో తెలిస్తే సమావేశంలో మాట్లాడటానికి వీలుం టుందన్నారు. ఎవరికీ తెలీకుండా సమావేశం పెడితే ప్రయోజనం ఏంటన్నారు. దీంతో మంత్రి పల్లె.. సూరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయన వినలేదు. ఇంతలో కేశవ్ కల్పించుకుని ‘మీరు చేస్తున్న తప్పిదాలు బయటకు వస్తాయేమోనని మాకు సమాచారం ఇవ్వలేదా?’ అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు.
ఇదే సందర్భంలో అధికారులు తనకు ఫోన్ చేసి సమావేశానికి వస్తారా అని అడిగారని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి అన్నారు. దీనిబట్టి వారి వ్యవహారశైలి ఏ విధం గా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
పనులు వేగవంతం చేయండి
హంద్రీనీవా పనులను వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రెండో దశలో రైల్వే క్రాసింగ్, భూ సేకరణ విషయంలో సమస్యలు వస్తుండడంతో జాప్యం జరుగుతోందని అన్నారు. గత ఏడాది 11.5 టీఎంసీలను తెచ్చి 49 చెరువులకు నీరిచ్చామన్నారు. ఈ ఏడాది గతేడాది కంటే ఎక్కువగా అందించాలన్నారు. వచ్చేఏడాది జూన్ నాటికి హెచ్చెల్సీ పనులు పూర్తి చేయాలన్నారు.
నీరు–చెట్టు కింద 1,847 పనులు మంజూరయ్యాయని, అసంపూర్తిగా ఉన్న వాటిపై దష్టి పెట్టాలన్నారు. నదులపై కట్టే బ్రిడ్జిలకు హైడ్రాలిక్ క్లియరెన్స్‌ను మన జిల్లాకు ప్రత్యేకంగా ఇవ్వాలని సీఎంను కోరనున్నట్లు మంత్రి పల్లె చెప్పారు. తుంగభద్ర డ్యాం నుంచి ఈ నెల 25న నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఆగస్టు 3వ తేదీ నాటికి మన జిల్లా సరిహద్దుకు వస్తాయని తెలిపారు. సమీక్షలో గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, శింగనమల ఎమ్మెల్యే యామినీబాల, జేసీ లక్ష్మీకాంతం, ఎస్‌ఈలు సుధాకర్‌బాబు, శేషగిరిరావు, సుబ్బారావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.