మాజీ మంత్రి మోపిదేవి ఫ్లెక్సీల చించివేత
పుష్కరాల నిర్వహణలో పూర్తిగా విఫలమైన టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, ఆయన అనుచర గణం రోజుకొక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
రేపల్లె: పుష్కరాల నిర్వహణలో పూర్తిగా విఫలమైన టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, ఆయన అనుచర గణం రోజుకొక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మోర్తోటలో గతంలో నిర్వహించిన అభివృద్ధి పనులకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం, పెనుమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో సరి పెట్టుకోని టీడీపీ నాయకులు మరో అడుగు ముందుకు వేశారు. ప్రజా ప్రతినిధుల ఆజ్ఞలతో చేశారో, కావాలని చేశారోగానీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫ్లెక్సీకి సమీపంలో అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు ఫొటోతో కూడిన భారీ కటౌట్‌ను కోసి చించివేశారు. దీంతో పాటు పట్టణంలో బస్టాండ్ సెంటరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా కోసివేయడంతో వైఎస్సార్ సీపీ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడటం సరైన విధానం కాదంటూ మండిపడుతున్నారు.