
ఎక్సైజ్ వర్సెస్ వైన్స్‌షాప్ యజమానులు
- జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్
- ప్రభుత్వానికి రూ. 4 కోట్ల నష్టం
- రెండుగా చీలిపోయిన ఎక్సైజ్ సిబ్బంది
- రెండుగా చీలిన ఎక్సైజ్ సిబ్బంది..
- ఎక్సైజ్‌మంత్రి దృష్టికి పంచాయితీ .
ఖమ్మంక్రైం : ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుందో ఏమోగానీ...వారి తీరును నిరసిస్తూ ఒక్కసారిగా శుక్రవారం జిల్లావాప్యంగా వైన్స్‌షాప్ యజమానులు మద్యం దుకాణాలు బంద్ చేశారు. పనిలోపనిగా ఎక్సైజ్ సిబ్బంది కూడా రెండుగా చీలిపోయింది. మూడునెలలుగా ఎక్సైజ్ అధికారులు... వైన్స్ యజమానుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం నడుస్తోంది. జిల్లాలో 147 మద్యం దుకాణాలకు పది నెలల క్రితం టెండర్లు ఆహ్వానించారు. ఆ ప్రక్రియ అంతా ముగిశాక వైన్‌షాపులను కేటాయించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాష్ట్ర డైరెక్టర్‌గా అకున్‌సబర్వాల్ ఆ సమయంలో బాధ్యతలు స్వీకరించారు. వచ్చిరాగానే రాష్ట్రవ్యాప్తంగా ఎంఆర్‌పీ కంటే వైన్‌షాపుల్లో మద్యం ఎక్కువ ధరకు విక్రయించినా, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కేసులు నమోదు చేయమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది ఆ శాఖలో కొందరికి మింగుడుపడలేదు. మూడునెలల క్రితం అకున్ సబర్వాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ అయ్యారు. అయినా చాలాచోట్ల ఎంఆర్‌పీకే మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే ఇటీవలికాలంలో ఎక్సైజ్ సిబ్బంది మద్యం దుకాణాలపై తరచుగా కేసులు చేయడం మెుదలుపెట్టింది. సాంకేతికపరమైన కేసులు అంటే... రిజిస్టర్‌లో సరుకు రాయకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సమయం వైన్‌షాపులను తెరచి ఉంచడం వంటి కేసులను పెట్టడం ప్రారంభించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణందారులంతా ఒక్కటై పలుమార్లు సమావేశమయ్యారు.
జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది రెండువర్గాలుగా చీలినట్లు సమాచారం. ఓSవర్గం వైన్‌షాపుల వైపు ఉండగా.. మరోవర్గం ఓ ఉన్నతాధికారి వైపు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ, కొంతమంది వైన్‌షాపుల యజమానులకు మద్దతు తెలపడంతోపాటు మీ పట్ల ఓ ఉన్నతాధికారి వర్గం కేసులు పెడుతున్నారు.. దీనిని ఎలాగైనా ఎదుర్కోవాలంటే వైన్‌షాపులు మూసివేయాలని సలహాలు సైతం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మద్యం వ్యాపారులంతా ఏకమయ్యారు.
రూ.4 కోట్ల ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం..
ఎక్సైజ్ శాఖ సిబ్బంది తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ శుక్రవారం మద్యం వ్యాపారులు జిల్లావ్యాప్తంగా దుకాణాలు బంద్ చేయడంతో రూ.4కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఇదేవిధంగా కొనసాగితే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి గండిపడే అవకాశం ఉంది.
జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది, వైన్‌షాపు వ్యాపారుల మధ్య జరుగుతున్న వ్యవహారం ఆ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ దృష్టికి చేరింది. ఓ ఉన్నతాధికారి తమను అన్యాయంగా వేధిస్తూ.. తమ దుకాణాలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. దీనిని పరిష్కరించకపోతే తాము నిరవధికంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తామని జిల్లా వైన్స్ వ్యాపారులు మంత్రిని కలిసి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ముందుముందు ఇది ఎంతవరకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందేనని కొంతమంది ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు అంటున్నారు.