లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో అన్ని హోటళ్లు తమ యజమానుల పేర్లను తప్పక ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.. ప్రతి హోటళ్లు.. అది రెస్టారెంట్ అయినా, రోడ్‌సైడ్ దాబా అయినా, లేదా ఫుడ్ కార్ట్ అయినా యజమాని పేరును ప్రదర్శించాల్సిందేనని పేర్కొన్నారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఇటీవల ముజఫర్‌నగర్ పోలీసులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లకు యజమానుల పేర్లు, మొబైల్ నెంబర్, క్యూ ఆర్ కోడ్‌ను.. బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు వివాదస్పదంగా మారాయి. వీటిపై ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది. ఈ ఉత్తర్వు పూర్తి వివక్షపూరితమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. యూపీలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. సామాజిక నేరంలాంటి ఈ ఉత్తర్వుపై కోర్టులు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ డిమాండ్ చేశారు.
అయితే విపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ యూపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కన్వర్ యాత్రకు వెళ్తున్నవారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు చెబుతోంది. హిందూ పేర్లతో ముస్లింలు మాంసాహారాన్ని యాత్రికులకు విక్రయిస్తున్నారని మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ ఆరోపించారు. వైష్ణో ధాబా భండార్, శాకుంభరీ దేవి భోజనాలయ, శుద్ధ్ భోజనాలయ వంటి పేర్లను రాసి మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
కాగా జులై 22 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment