బిజినెస్ బహానా
పసిగట్టలేకపోయిన భార్య
బావమరిది నిఘా
‘నిన్ననే వచ్చారు.. మళ్లీ ఇవ్వాళ ప్రయాణమవుతున్నారు. ఒక్కపూట కోసం ఇంటి దాకా రావడం ఎందుకు? ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర్లోనే ఓ రూమ్ చూసుకోండి’ నిష్ఠూరమాడింది.
‘బిజినెస్ పనులు అలాంటివి మరి.. అర్థం చేసుకోకపోతే ఎలా? ఈ కష్టమంతా మీ కోసమే కదా..!’ షూస్ వేసుకుంటూ అన్నాడు.
‘ఆ..ఆ.. ఈ మాటతోనే నోరు మూయిస్తారు’ తను సర్దిన బ్యాగ్‌ను అతని దగ్గర పెడుతూ అంది.
పర్స్‌లోంచి చేతికి అందినంత డబ్బు తీసి ఆమెకిస్తూ ‘జాగ్రత్త.. పిల్లలు ఏదడిగినా కొనిపెట్టు. పిసినారితనం చూపించకు’ అన్నాడు.
ఆ డబ్బును అక్కడే సోఫాలో పెడుతూ ‘మీరిలా నెలకు ఇరవై రోజులు బిజినెస్ పనంటూ ఊళ్లు తిరిగితే పిల్లలు మీరు కొనిపెట్టే వస్తువులనే గుర్తుంచుకుంటారు.. మిమ్మల్ని కాదు’ చురకంటించింది.
‘అబ్బా.. ఈసారి నుంచి పార్టనర్స్‌కే అప్పజెప్తాలే.. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా వెళ్లనీ!’ కాస్త విసుక్కున్నాడు.
‘హూ.. తిరిగి ఎప్పుడు రాక?’ అడిగింది నిష్ఠూరంగానే!
‘నా చేతుల్లో ఉంటుందా చెప్పు పని? ఇల్లు వదిలేసి ఊళ్లు తిరగడం నాకు మాత్రం సరదానా? ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వచ్చేస్తాలే’ అంటూ లేచాడు బ్యాగ్ పట్టుకుని.
‘త్వరగా అయిపోగొట్టుకుని రండి’ అతని వెనుకే నడిచింది గుమ్మం దాకా!
∙∙
‘ఏ ఊరికి వెళ్లాడు?’
‘ఇంట్లో బాంబే అని చెప్పాడు. అతను వాళ్లింటి నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేదు. రైల్వేస్టేషన్‌కీ వెళ్లలేదు. సిటీ ఔట్‌స్కట్స్‌లో తన కారులోంచి దిగిపోయి, మరో కారులోకి మారాడు’ చెప్పాడు.
‘ఓకే..’ అంటూ అవతల ఫోన్ డిస్కనెక్ట్ చేశారు.
ఇవతల వ్యక్తీ రిసీవర్ క్రెడిల్ చేసి.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చాడు.
రెండు రోజులకు..
ఆ సిటీ పాష్ లొకాలిటీలోని ఓ డూప్లెక్స్ ఇల్లు.. వాచ్‌మన్ చేత గేట్ తెరిపించుకుని ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఉంది ఐటీ టీమ్. కాలింగ్ బెల్ నొక్కాడు ఆఫీసర్. వాళ్ల వెనుకే కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన వాచ్‌మన్‌ని.. ఆ టీమ్‌లోని ఓ వ్యక్తి ఆపి, ఏదో సర్ది చెబుతూ తీసుకెళ్లి మళ్లీ గేట్ దగ్గరే కూర్చోబెట్టాడు. ఈలోపు ద్వారం తెరుచుకుంది. టీమ్ లోపలికి వెళ్లింది.
‘మేడం.. ఎవరో వచ్చారు’ తలుపు తీసిన పనమ్మాయి యజమానికి చెప్పింది.
‘ఎవరూ..?’ అంటూ యజమాని హాల్లోకి వచ్చింది.
‘ఫ్రమ్ ఇన్‌కమ్ టాక్స్..’ అంటూ తన ఐడీ చూపిస్తూ, తన టీమ్‌కి సైగ చేశాడు సోదా చేయమని!
‘మా ఆయన లేనప్పుడు ఎలా వస్తారు? ఆయన ఊర్లో లేరు’ చెప్పింది ఆమె గాభరాగా.
‘తెలుసు.. మీవారు ఎక్కడున్నారో అక్కడికీ వెళ్లింది మా టీమ్!’ అంటూ పై అంతస్తుకు మెట్లెక్కసాగాడు.
మూడు బెడ్‌రూమ్‌లు, దేవుడి గది, వంటిల్లు అన్నీ సోదా చేశారు. ఎక్కడా ఏమీ దొరకలేదు. ఆ టీమ్‌లోని ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చి.. మళ్లీ మాస్టర్ బెడ్రూమ్‌కి వెళ్లింది. వార్డ్‌రోబ్స్‌కి ఎక్స్‌టెన్షన్‌గా ఉన్న ప్లేస్‌ను పరిశీలనగా చూడసాగింది. ఆమెనే అనుసరించిన యజమాని ‘అది బాత్రూమ్ డోర్’ అంది. దానికి అపోజిట్ వైపు చూపిస్తూ ‘అది కదా బాత్రూమ్?’ అడిగింది ఉద్యోగిని. ‘అంటే... దీనికి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి’ చెప్పింది కాస్త తత్తరపడుతూ. ‘చూద్దాం..’ అంటూ ఆమెను పక్కకు తప్పిస్తూ ఆ ఎక్స్‌టెన్షన్‌ను తట్టింది ఉద్యోగిని. తలుపు తెరుచుకుంది. అది బాత్రూమ్ కాదు. వాక్ ఇన్ వార్డ్‌రోబ్. మిగిలిన టీమ్ కూడా వచ్చింది. వెదికారు. కిలో వరకు బంగారం, మూడు కిలోల వరకు వెండి, క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే దొరికాయి.
ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా.. ఆ ఇంటి ల్యాండ్‌లైన్ మోగింది. యజమాని రిసీవర్ తీయబోతుండగా.. ఆగమని సైగ చేస్తూ ఐటీ ఆఫీసర్ రిసీవర్ తీశాడు.
‘హలో.. ’ అవతలి నుంచి.
‘యెస్.. ’ ఐటీ ఆఫీసర్.
ఆ గొంతును పోల్చుకున్నట్టున్నారు అవతలి వాళ్లు సంభాషణ కొనసాగింది. ‘సర్.. అతను ఇక్కడ హోటల్‌లో ఉన్నాడు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నాడు’ చెప్పాడు అవతలి వ్యక్తి.
‘ఫ్యామిలీతోనా?’ ఐటీ ఆఫీసర్ ఆ మాట అంటూండగా యజమాని భృకుటి ముడిపడింది.
‘అవును సర్.. అతనితోపాటు అతని వైఫ్ కూడా ఉంది’ చెప్పాడు అవతలి వ్యక్తి.
‘వైఫా? మరి ఇక్కడ ఎవరూ?’ అంటూ ఆ ఇంటి యజమాని వైపు చూశాడు ఐటీ ఆఫీసర్.
అర్థమైనట్టుంది ఆమెకు.. వెంటనే రిసీవర్ లాక్కుని ‘హలో.. ఆయనకు ఫోన్ ఇస్తారా ఒకసారి?’ అడిగింది ఆవేశం ఎగసిపడుతుండగా!
ఆయన లైన్‌లోకి వచ్చాడు ‘హలో..’ అంటూ!
‘ఇదా మీ బిజినెస్ పని? ఎవరు ఆ ఫ్యామిలీ?’
‘హలో.. వాళ్లేదో అనుమానపడుతున్నారు.. నే..ను..’ అని అతను అంటూండగానే ఇవతల ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
అవమానం, బాధ ఆమె కళ్లల్లో నిండాయి నీళ్లుగా!
ఫార్మాలిటీస్ కూడా పూర్తవడంతో ఐటీ టీమ్ అక్కడ నుంచి నిష్క్రమించింది.
ముంబై పేరు బొంబాయిగా ఉన్నప్పుడు జరిగిన రెయిడ్ ఇది. ఆ బిజినెస్‌మన్ పన్ను ఎగ్గొట్టిన సంపద గురించి ఐటీ వాళ్లకు సమాచారమిచ్చింది స్వయాన అతని బావమరిదే. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆ బావమరిదీ అందులో భాగస్వామే. కానీ బావగారు మిగతావాళ్లతో చేరి బావమరిదిని బయటకు పంపించేశాడు. అది మనసులో పెట్టుకుని ఐటీ వాళ్లకు టిప్ అందించాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడింది అతని బావమరిదే! అయితే అతనికీ తెలీదు తన సోదరిని కూడా ఆ బావగారు మోసం చేస్తున్నట్టు! మాటిమాటికీ బిజినెస్ టూర్లకు వెళ్తున్నాడు అంటే అక్కడ కూడా లెక్కాపత్రాల్లేని డబ్బో, స్థిరాస్తులో ఉంటాయనుకుని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వసాగాడు.
Comments
Please login to add a commentAdd a comment