♦ పాఠశాలలు, టీచర్ల విభజనపై కసరత్తు
♦ పంపకాలపై విద్యా శాఖ దృష్టి
♦ ఎదురుకానున్న స్థానికత చిక్కు
♦ నివేదిక తయారీలో నిమగ్నం
ఖమ్మం : జిల్లా విద్యా శాఖ పాఠశాలలు, టీచర్ల పంపకాలపై దృష్టి సారించింది. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలకు ఎన్ని పాఠశాలలు.. ఎందరు ఉపాధ్యాయులు వెళ్తున్నారనే విషయంపై కసరత్తు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 41 మండలాలు ఉండగా.. భూపాలపల్లి జిల్లాకు రెండు, మహబూబాబాద్ జిల్లాలోకి మూడు.. కొత్తగూడెం జిల్లాలోకి 16 పోగా.. 20 మండలాలతో ఖమ్మం జిల్లా మిగలనుంది. ప్రస్తుతం 2,319 ప్రాథమిక, 626 ప్రాథమికోన్నత, 625 ఉన్నత పాఠశాలలతోపాటు హెచ్‌ఎస్‌ఎస్ పాఠశాలలు 15, జూనియర్ కళాశాలలు 141.. మొత్తం 3,799 ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. వీటిలో జిల్లావ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో పీఎస్‌లో 810, యూపీఎస్‌లో 37, హెచ్‌ఎస్ 1,394, హెచ్‌ఎస్‌ఎస్‌లో 199.. మొత్తం 2,717 మంది ఉపాధ్యాయులు, మండల, జిల్లా పరిషత్‌లోని పీఎస్‌లలో 3,720 మంది, యూపీఎస్‌లో 1,778, హైస్కూల్‌లో 3,436.. మొత్తం 8,934 మంది పనిచేస్తున్నారు. వీరిలో 921 మంది ఉపాధ్యాయులను మహబూబాబాద్‌కు, 4,600 మంది కొత్తగూడెం, 5,573 మంది ఖమ్మంకు, 280 మంది భూపాలపల్లి జిల్లాల్లో కేటాయించిన ప్రాంతాల్లో పనిచేయనున్నారు.
స్థానికత చిక్కు..
జిల్లాల పునర్విభజన జరిగితే ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నాలుగు జిల్లాల పరిధిలోకి వెళ్లనున్నాయి. వాజేడు, వెంకటాపురం భూపాలపల్లి జిల్లాలోకి, బయ్యారం, గార్ల, ఇల్లెందు మహబూబాబాద్ జిల్లాలోకి, 16 మండలాలు కొత్తగూడెంలోకి, మిగిలిన 20 మండలాలు ఖమ్మం జిల్లాలోనే ఉంటాయి. అయితే నాల్గవ తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు ఏ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తే స్థానికత ఆధారంగా ఆ జిల్లాకు కేటాయిస్తారు.
అయితే జిల్లాలోని పాఠశాలలు నాలుగు జిల్లాల్లో కలిస్తే ఉపాధ్యాయుల స్థానికత కూడా మారే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు వంటి పట్టణాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు స్థానికంగానే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దీనిని ఆధారం చేసుకుని ఉపాధ్యాయులను విభజన చేస్తారా? లేదా ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇచ్చి విభజిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానికతనే ఆధారంగా తీసుకుంటే.. ఏళ్ల తరబడి వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
అధికారులకు తప్పని విభజన
పాఠశాలలు, ఉపాధ్యాయుల కేటాయింపు మాదిరిగానే విద్యా శాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కూడా విభజన సందర్భంగా స్థానచలనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఈఓ, ఏడీఈ, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్, అటెండర్లను కూడా విభజించి.. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కేటాయించేందుకు విద్యాశాఖాధికారులు జాబితా తయారు చేసినట్లు తెలిసింది. వారి సీనియారిటీ ఆధారంగా ఖమ్మంలో కొందరిని ఉంచి.. మిగిలిన వారిని కొత్తగూడెం పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ పరిధిలో 48 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఖమ్మం జిల్లాకు 26 మందిని, కొత్తగూడెం జిల్లాకు 22 మందిని కేటాయించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఖమ్మంలోనే సుదీర్ఘకాలంగా తిష్ట వేసిన ఉద్యోగులు ఖమ్మం విడిచి వెళ్లేది లేదని.. ఎలాగైనా తమను ఇక్కడే ఉంచేలా చూడాలని ఉన్నతాధికారులకు విన్నవించుకోవడం గమనార్హం.