సంక్షేమ పథకాలపై ఎగ్జిబిషరన్ స్టాళ్లు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్‌టౌన్ : గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఎగ్జిబిషన్ సాళ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ఆర్జీదారులు వచ్చి ఫిర్యాదులు అందజేశారు. బీడీ కార్మికుల ఫించన్ దరఖాస్తులు 76, గృహనిర్మాణం కోసం 120, వికలాంగుల ఫించన్ల కోసం 6, అభయహస్తం 2, ఇతర అంశాలకు సంబంధించిన 6 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, విద్యా, స్త్రీ, మహిళ సంక్షేమం, డీఆర్‌డీఏ, డబుల్ బెడ్‌రూం, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, రహదారుల భద్రత, జాతీయ ఓటరు దినోత్సవం, విద్యుచ్ఛక్తి తదితర అంశాలపై గణతంత్ర దినోత్సవం రోజు ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
పరేడ్ గ్రౌండ్‌లో వీటిని ప్రదర్శించాలని కోరారు. లక్ష్మణచాంద మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఎస్. నారాయణ వికలాంగుల ఫించన్ కోసం, నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌కు చెందిన జి. గంగాధర్ అభయహస్తం ఫించన్ కోసం, దిలావర్‌పూర్ మండలం సాంగ్వికి చెందిన భూమవ్వ బీడీ కార్మికుల ఫించన్, నర్సాపూర్‌కు చెందిన నవనీత, ప్రమీల బీడీ కార్మికుల ఫించన్ మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీఓ నారాయణ, జిల్లా వైద్యాధికారి జలపతినాయక్, ఆసుపత్రి సూపరిండెంటెంట్ సురేష్, జిల్లా విద్యాధికారి ప్రణీత, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ప్రభాకర్, డీఎంఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పింఛన్లు రావడం లేదు
అన్ని అర్హతలు ఉన్నా బీడీ పింఛన్ రావడం లేదు. పలుకుబడి ఉన్నవారికే అధికారులు పింఛన్లను అందజేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బీడీలను చుడుతూ జీవనం సాగిస్తున్నాం. పీఎఫ్ కూడా ఉన్నప్పటికీ అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు బీడీ పింఛన్ ఇప్పించాలి.
– వెల్మల్ బొప్పారం గ్రామస్తులు