కాపుల సమస్యలు మంజునాథ్ కమిషన్‌కు తెలియజేయండి
కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు
విజయవాడ (గాంధీనగర్) :
కాపు కులస్తుల సమస్యలు, స్థితిగతులను జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తెలియజేయాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కాపునాడు నగర కమిటీ ప్రమాణస్వీకారోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరాన్ని మంజునాథ్ కమిషన్‌కు వివరించాలని చెప్పారు. జిల్లాలో కమిషన్ పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలు సహకరించాలని కోరారు. అనంతరం కాపునాడు నగర అధ్యక్షుడిగా యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర కార్యదర్శిగా రంగిశెట్టి సత్యనారాయణ, నగర మహిళా కార్యదర్శిగా వరలక్ష్మి ప్రమాణస్వీకారం చేశారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు నియామకపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం పిళ్లా వెంకటేశ్వరరావును కాపునాడు నగర నాయకులు సన్మానించారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు, నాయకులు పానక్‌దేవ్, ఎం.జయప్రద, కె.రజనీ, జయశ్రీ, భానుకుమారి, కృష్ణ వందన పాల్గొన్నారు.