బీడు భూములపై కన్ను
బీడు భూములపై కన్ను
Published Wed, Nov 2 2016 5:30 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
* 159 ఎకరాల్లో దుర్గి బీడు భూములు
* 60 ఎకరాల్లో రాత్రి వేళ చదును పనులు
* అధికార పార్టీ అండతోనే కబ్జా..?
దుర్గి బీడు భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. 159 ఎకరాల్లో విస్తరించిన ఈ భూముల్లో 60 ఎకరాలను రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా చదును చేయిస్తున్నారు. ఓ పది ఎకరాల్లో ఇప్పటికే పత్తి పంటను సాగు చేశారు. పశువుల మేతకు వినియోగించే భూములను కబ్జా చేయడంపై రైతులు, పశుపోషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
దుర్గి : దుర్గి బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో బుగ్గవాగు రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న దుర్గి బీడు భూములుగా పేరుగాంచిన ఎన్‌ఎస్‌పీ భూములు సుమారు 159 ఎకరాలు ఉన్నాయి. అందులో కబ్జాదారులు సుమారు 60 ఎకరాలను రాత్రి సమయాలలో పొక్లయిన్లతో పిచ్చిమొక్కలు, బండరాళ్లను తొలగించి సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుర్గి గ్రామస్తుల ద్వారా సోమవారం వెలుగులోకి వచ్చింది. అందులో 10 ఎకరాల భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ భూ కబ్జాలకు పాల్పడిన ప్రముఖ వ్యక్తులు దుర్గి, కంచరగుంట, ఆత్మకూరు, కంభంపాడు, అంజనాపురం గ్రామాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెల మేత కోసం ఉపయోగించుకుంటున్నారు. భూములను కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఇలాంటి ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడడంలో కొంతమంది ముందంజలో ఉన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు నివసించడానికి రెండు సెంట్ల భూమి కూడా ఇవ్వలేని నాయకులు కబ్జాదారులకు అండదండలుగా ఉండటం శోచనీయం. దీనిపై తహసీల్దార్ ఏసుబాబును ‘సాక్షి’ వివరణ కోరింది. గురువారం భూములు పరిశీలిస్తామని, ఆక్రమణ జరిగినట్లు ఉంటే నిందితులపై చర్యలు తీసుకుం టామని వివరించారు.
Advertisement