దయనీయం.. సర్వజన వైద్యం!
జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యం.. దయనీయంగా మారుతోంది. వార్డుల్లో వైద్యులు ఎప్పుడొస్తారో తెలీదు! సిబ్బంది ఉన్నా... అక్కడి రోగులను పట్టించుకునే ఓపిక వారి ఉండదు. ఫలితంగా పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తున్న వారు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరికి వారే సొంత ‘సేవలు’ చేసుకోవాల్సిన దుస్థితి నెలకుంది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన నారాయణరెడ్డి (80) గురువారం రాత్రి నుంచి మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఈయన్ను సర్వజనాస్పత్రికి తీసుకురాగా మేల్ సర్జికల్ వార్డులో చేర్చారు.
ఈ వార్డులో పది మంది వరకు నర్సింగ్ విద్యార్థులు, నర్సులు ఉన్నా వార్డులోని ఓ గదికే పరిమితమయ్యారు. మూత్ర సమస్య కారణంగా నారాయణరెడ్డికి బ్లీడింగ్ మొదలైంది. స్పందించాల్సిన వైద్య సిబ్బంది అటుగా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. బెడ్ అంతా రక్తపు మరకలయ్యాయి. దీంతో కొడుకు హనుమంతరెడ్డి, కుమార్తె లక్ష్మీదేవి తమ తండ్రికి సపర్యలు చేయడం మొదలు పెట్టారు. చివరకు ఈ దృశ్యాలను ‘సాక్షి’ చిత్రీకరిస్తుండగా అప్రమత్తమైన వైద్య సిబ్బంది హడావుడి చేశారు. ఇలాంటి దయనీయ దృశ్యాలు ‘పెద్దాస్పతి’లో కొకొల్లలుగా కన్పిస్తాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు రోగులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– అనంతపురం మెడికల్