
ప్రాణాలతో చెలగాటం
- అస్తవ్యస్తంగా చిన్నపిల్లల వార్డు
- ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే వార్డు మార్పు
- పట్టించుకునేవారు లేరు
- ఇదీ సర్వజనాస్పత్రి దుస్థితి
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే చిన్నపిల్లల వార్డును సూపరింటెండెంట్ బ్లాక్ పైభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన భవనంలోకి మార్చడం పలు విమర్శలకు దారితీస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే వారు మరింత ఇబ్బందులకు గురయ్యేలా యాజమాన్యం వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వార్డులో గందరగోళ పరిస్థితి నెలకొది.
ప్రమాదకరంగా మెట్లు :
నూతన భవంలో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. మెట్ల వద్ద గేట్ వేయకపోవడంతో పాటు గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అలాంటి ముందస్తు జాగ్రతలు తీసుకోలేదు. ఎవరైనా రోగుల బంధువులు ఫోన్ మాట్లాడేటప్పుడు పొరపాటున జారి పడితే మూడో అంతస్తు నుంచి కిందకు పడే అవకాశం ఉంది. రాత్రివేళల్లో బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు గేట్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
పరికాల అమరికేది? :
వార్డులో కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్లకు స్విచ్‌బోర్డు ఏర్పాటు చేయలేదు. ప్రమాదకరమైన కేసులకు వెంటిలేటర్ తప్పనిసరి. ఐసీయూలో ఏసీలు బిగించలేదు. తాగేందుకు నీటి సదుపాయం లేదు. దీన్నిబట్టిచూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే యాజమాన్యం చిన్నపిల్లల వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. శనివారం ఉదయం ఫర్హాన్ అనే చిన్నారి తప్పిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి వారి తల్లిదండ్రులకు అందజేశారు. మూడో అంతస్తు కావడంలో వేడి అధికంగా వస్తుంటుంది. వాల్ రూఫింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
సిబ్బంది కొరత :
ప్రస్తుతం వార్డులో 200 మంది చిన్నారుల అడ్మిషన్‌లో ఉన్నారు. షిప్ట్‌కు ముగ్గురు స్టాఫ్ నర్సులను మాత్రమే నియమించారు. వాస్తవంగా వార్డులో నాలుగు యూనిట్లు ఉన్నాయి. యూనిట్‌కు ఇద్దరు స్టాఫ్ నర్సులైనా విధుల్లో ఉండాలి. ఇక సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని మాత్రమే కేటాయించారు. శనివారం ఉదయం ఫర్హాన్ అనే చిన్నారి తప్పిపోయాడు. దీంతో రోగుల అటెండర్లు పదుల సంఖ్యలో వార్డుల్లోనే తిష్టవేశారు. దీని ద్వారా క్రాస్ ఇన్‌ఫెక‌్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ముందుగానే చెప్పాం
యూనిట్‌లో అన్నీ సమకూర్చాకే వార్డును ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లా. యూనిట్‌లో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.
పరికరాల ఏర్పాటుకు స్విచ్‌బోర్డు, రూఫింగ్, ఏసీలు బిగించాల్సి ఉంది. గైనిక్ వారి కోసం ఆత్రుతతో యూనిట్ మార్చాల్సి వచ్చింది.
- డాక్టర్ మల్లీశ్వరి, చిన్నపిల్లల వార్డు హెచ్‌ఓడీ