నకిలీ జ్యోతిష్యుడి ఆటకట్టు
చెన్నూరు : ‘మీకు శనిదోషం ఉంది. మృత్యు కళ ముఖంలో కనపడుతుంది. వారం రోజుల్లో చనిపోతారు. ఎంత డబ్బు వచ్చినా రాహుకాల దోషం వల్ల నిలవడటం లేదు. అందుకు విరుగుడుగా తాయత్తు కట్టాలి. ఇంటికి దోష పరిహారం చేయాలి. లేకపోతే చాలా అరిష్టం’ అంటూ ప్రజలను భయపెట్టి, మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చెన్నూరులోని సరస్వతినగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపకు చెందిన రామాంజనేయులు15 రోజులుగా కాటి కాపరుడి వేషం వేసుకొని గ్రామంలో తిరుగుతూ పురుషులు లేని ఇంటిలోకి నేరుగా వెళ్తాడు. మహిళలకు జ్యోతిష్యం పేరుతో మాయమాటలు చెప్పి, భయపెట్టి వారి వద్దనున్న సొమ్మును దోచుకునే వాడు. ఒంటిరిగా ఉన్న వారిని మభ్యపెట్టి తాయత్తు కచ్చితంగా వేసుకో, మంచి జరుగుతుందని, లేకపోతే అరిష్టం అంటూ చెప్పేవాడు. దీంతో భయపడి తాయత్తు వేయించుకొంటే రూ. 200 నుంచి రూ.500 వరకు తీసుకునే వాడు. దుకాణాల వద్దకు వచ్చి బెదిరించే వాడు. మద్యం సేవించి, దక్షిణ వేయాలని లేకపోతే మీ కథ చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో సరస్వతీనగర్‌కు చెందిన ప్రజలు శుక్రవారం విషయాన్ని పోలీసులకు చెప్పారు. అతన్ని వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సాయంత్రం వరకు పెట్టుకుని, అతని వద్ద ఉన్నది దోచుకొని పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఏఎస్‌ఐ యల్లంరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రజలు కాటికాపారుడిని అప్పగించిన విషయం వాస్తవమేనని, అతన్ని మందలించి పంపామని తెలిపారు.