ఆయనకు ఒక్కగానొక్క కూతురు.. పెంచి.. పెద్దచేసి కుమార్తె క్షేమం కోసం ఏరికోరి నచ్చిన మనువు ఇచ్చాడు. భర్త వేధింపులు ఆమెను బలి తీసుకుంటాయని ఊహించలేకపోయాడు. బిడ్డ పడుతున్న కష్టాలు చూసి తండ్రి కలతచెందాడు. అల్లుడి వేధింపులు తాళలేక కూతురు
ఆత్మహత్యకు పాల్పడింది.. ఇది జీర్ణించుకోలేని ఆ తండ్రి కూడా పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
బిజినేపల్లి (తిమ్మాజిపేట): భర్త వేధింపులకు తాళలేక కూతురు ఆత్మహత్యకు ఒడిగట్టింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా మారవడంతో తానూ పురుగుమందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ విషాదకర సంఘటన శనివారం బిజినేపల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కన్నె కాశన్న(64), కొండమ్మకు ఒక్కగానొక కూతరు బాలమణి(30). ఆమెను బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన స్వామికి ఇచ్చి పెళ్లిచేశారు. వారికి కొడుకు ఉన్నాడు. ఇంతలో సాఫీగా సాగుతున్న సంసారంలో వేధింపుల చిచ్చు మొదలైంది. స్వామి తరుచూ భార్యను చితకబాదేవాడు. ఇదిలాఉండగా, బుధవారం కుమ్మెర జాతరలో కూతురు బాగోగులు తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తె, అల్లుడిని ఇంటికి రమ్మని కోరారు. అందుకు స్వామి నిరాకరించడంతో బాలమణిని తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి అత్తవారింటికి వెళ్లమని తల్లిదండ్రులు ఆమెను కోరారు. ‘చావనైనా.. చస్తాను కానీ కాపురానికి వెళ్లను’ అని బాలమణి మొండికేసి ఇంటినుంచి వెళ్లిపోయింది.
తండ్రి కాశన్న కూతురు కోసం పొలం వద్దకు వెళ్లి చూడగా పురుగుమందు తాగి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించాడు. దీంతో తల్లడిల్లిన తండ్రి అక్కడే ఉన్న పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వెళ్లేలోగా ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతిగుండె తల్లడిల్లింది. సీఐ గిరిబాబు, ఎస్‌ఐ దస్రూనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తల్లడిల్లిన తండ్రి గుండె
Published Sun, Feb 22 2015 3:02 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement