నకిలీ నోట్ల ముఠా అరెస్టు
-
రూ. 15.84 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
-
ఐదుగురి అరెస్టు
రాజమహేంద్రవరం క్రైం :
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజ కుమారి, అడిషినల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ ఆ వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కడియం పోలీస్ స్టేషన్ సీఐ, ఆయన సిబ్బంది కడియం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా అనపర్తి వైపు నుంచి వస్తున్న మారుతీ కారు, మూడు మోటారు సైకిళ్లపై వస్తున్న వారిని తనిఖీ చేయగా వారి వద్ద నకిలీ రూ. 1000 నోట్లు లభించాయి. అనపర్తి, సావరం గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాస రెడ్డి , బలభద్రపురం గ్రామానికి చెందిన నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, పొలమూరు గ్రామానికి చెందిన కర్రి రామకృష్ణారెడ్డి, అనపర్తికి చెందిన షేక్ సులూన్ సాహెచ్, కత్తిపూడికి చెందిన బర్నికల వీర వెంకట సత్యనారాయణలు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నకిలీ నోట్ల కట్ట లక్ష రూపాయలు చొప్పున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నకిలీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే కలర్ జిరాక్స్ మిషన్, కట్టర్, ప్రింటింగ్ కు ఉపయోగించే కటిరేడ్స్ కలర్స్ బాటిల్స్, నోట్లు ముద్రించేందుకు ఉపయోగించే పేపర్లు పొలమూరులోని కొవ్వూరి శ్రీనివాస రెడ్డి ఇంటి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫైనాన్స్ వ్యాపారం పేరుతో చలామణి
వీరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ నకిలీ నోట్లు రుణగ్రహీతలకు ఇచ్చి చలామణి చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. కొవ్వూరి శ్రీనివాస రెడ్డి కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్ల చెలామణి కేసులో అరెస్టు అయ్యాడని తెలిపారు. అదే విధంగా కర్రి రామMýృష్ణ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అరెస్టు అయ్యాడని పేర్కొన్నారు. రూ. 15 లక్షలు నకిలీ నోట్లు వేరే వారికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ. 25 వేలతో కలర్ ప్రింటర్, పేపర్, కట్టర్, కలర్స్ కొనుగోలు చేశారని ఎస్పీ రాజకుమారి తెలిపారు. సత్తిరెడ్డి ఆధ్వర్యంలో వీటిని ముద్రించి చలామణి చేసేందుకు పథకం పన్నారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. ఈ ముఠాను అరెస్టు చేయడానికి సహకరించిన క్రైం డీఎస్పీ ఎ. సత్యనారాయణ, ఎస్సై జీవీ నారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్‌వీ రమణ, కె. సురేష్, కానిస్టేబుల్ వి. Mýృష్ణలకు అభినందనలు తెలిపారు.