అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు | international fake currency racket team arrested in hyderabad | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

Published Wed, Oct 19 2016 6:36 PM | Last Updated on Thu, Jul 26 2018 1:42 PM

అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు - Sakshi

అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

- కరాచీ టు సిటీ వయా షార్జా...
- ముగ్గురు నిందితుల అరెస్టు, రూ.9 లక్షలు సీజ్ 
- తొలిసారిగా వెలుగులోకి విమానమార్గ రవాణా 
 
హైదరాబాద్ : పాకిస్థాన్‌లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారానూ హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 
 
హైదరాబాద్‌లోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖీల్ మార్ఫానీ వృత్తిరీత్యా కార్పెంటర్ కావడంతో బతుకు తెరువు కోసం గతంలో సౌదీ వెళ్ళాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం నగరంలోనే నివసించిన ఇతగాడు గత ఏడాది జూలైలో షార్జా వెళ్ళాడు. అక్కడి ఓ శానిటరీ షాపులో కార్పెంటర్‌గా చేరాడు. అనారోగ్యంతో బాధపడిన ఇతగాడు కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళకపోవడంతో అప్పులు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు.
 
మార్ఫానీ ఆర్థిక ఇబ్బందులపై ఫోన్ ద్వారా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న తన మేనమామ మహ్మద్ యాసీన్‌కు చెప్పాడు. మొఘల్‌పుర ప్రాంతానికే చెందిన అతను దాదాపు 26 ఏళ్ళుగా కరాచీలో నివసిస్తున్నాడు. మార్ఫానీ ద్వారా విషయం తెలుసుకున్న యాసీన్ పాకిస్థాన్‌లో పక్కాగా ముద్రిమతమ్యే భారత నకిలీ నోట్ల మార్పిడి చేస్తే మంచి లాభాలు ఉంటాయని సలహా ఇచ్చాడు. ప్రాథమికంగా రూ.2 లక్షలు నగరంలోని మార్ఫానీ కుటుంబానికి పంపించాడు. ఆపై తన ఏజెంట్ ద్వారా రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్‌లో ఉన్న రూ.9 లక్షల నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానన్నాడు. ఆ నగదును హైదరాబాద్ తీసుకువెళ్ళి చెలామణి చేయాలని, తన వాటాగా రూ.3 లక్షలు ఇస్తే చాలని మార్ఫానీతో చెప్పాడు. దీనికి మార్ఫానీ అంగీకరించడంతో దుబాయ్‌లోని డేరా ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా యాసీన్ నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంగా నేర్పుగా పేర్చిన మార్ఫానీ దాన్ని తీసుకుని ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు. 
 
విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను బ్యాగేజ్‌లో వేసి తీసుకువచ్చాడు. దీన్ని ఏ దశలోనూ అధికారులు గుర్తించకపోవడంతో నకిలీ నోట్లు బ్యాగ్‌ను మార్ఫానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజుల పాటు రహస్య ప్రదేశంలో దాచి మార్పిడి కోసం తన స్నేహితులైన ఘియాస్ మోహియుద్దీన్ (హుస్సేనిఆలం), మహ్మద్ తౌఫీఖ్ అహ్మద్ (సంగారెడ్డి) సహాయం తీసుకోవాలని నిర్ణయించాడు. వాటాలు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరూ ముందుకు వచ్చారు. 

ఈ ముగ్గురూ కలిసి నకిలీ నోట్లను మార్పిడి చేసే యత్నాల్లో ఉన్నారనే సమాచారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌కు అందింది. ఆయన సమాచారంతో అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్ పి.బల్వంతయ్య, ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి తమ బృందాలతో వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును మహంకాళి పోలీసులకు అప్పగించామని, కరాచీలో ఉన్న యాసీన్ కోసం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తామని డీసీపీ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement