నకిలీ డీజిల్ తయారీ ముఠా గుట్టు రట్టు | Fake diesel manufacturing gang Arrested | Sakshi
Sakshi News home page

నకిలీ డీజిల్ తయారీ ముఠా గుట్టు రట్టు

Published Sun, Jul 31 2016 8:42 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Fake diesel manufacturing gang Arrested

- 15వేల లీటర్ల నకిలీ డీజిల్, 6వేల లీటర్ల బ్లూ కిరోసిన్ స్వాధీనం
- నాలుగు ట్యాంకర్లు సీజ్.. ఎనిమిది మంది అరెస్టు, రిమాండ్
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ సునితామోహన్
సూర్యాపేటమున్సిపాలిటీ(నల్గొండ జిల్లా)

 నకిలీ డీజిల్ తయారు చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. ఆదివారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్ ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 24వతేదీ రాత్రి పట్టణంలోని బాలాజీనగర్‌లో గల సుమతికి చెందిన ఇంట్లో డీఎస్పీ సునితామోహన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ డీజిల్ తయారీ విషయం బయటకు పొక్కింది.

 

దీంతో అక్కడి నుంచి తయారీదారులు పారిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్న 8వేల లీటర్ల నకిలీ డీజిల్, 4వేల లీటర్ల బ్లూ కిరోసిన్‌తోపాటు నకిలీ డీజిల్ తయూరీకి ఉపయోగించే కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఈ నెల 28న తయారీదారుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న బ్రాహ్మాండ్లపల్లి దేవదత్తు గుమాస్తాలు సంతోష్, షేక్ రహీమ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కాగా శనివారం పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో శ్రావణ్, కెమికల్స్ సప్లయ్ చేసే సాధినేని వెంకటేశ్వర్లు, ఆయన గుమాస్తా అశోక్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా నార్కట్‌పల్లి శివారులో బ్రాహ్మాండ్లపల్లి దేవదత్తు, సంతోష్‌కుమార్‌లు కలిసి కిరోసిన్‌లో కెమికల్స్ కలిపి నకిలీ డీజిల్ తయారు చేస్తున్నారని, వారికి తాము సహకరిస్తున్నట్టు ఒప్పుకున్నారు.

 

వెంటనే వారిని తీసుకొని నార్కట్‌పల్లి వెళ్లి సంతోష్‌కుమార్ ను, అతడి డ్రై వర్ డేవిడ్‌రాజు, హైదరాబాద్‌కు చెందిన గౌరీశంకర్, అతడి డ్రై వర్ అజీం, దేవిదత్తు డ్రై వర్ సతీష్‌లను అరెస్టు చేశామన్నారు. సంతోష్‌కు చెందిన రెండు ట్యాంకర్స్, 7వేల లీటర్ల నకిలీ డీజిల్, 2వేల లీటర్ల కిరోసిన్, రెండు కరెంటు మోటార్స్, రెండు ప్లాస్టిక్ గమ్ బాటిల్స్, ఐదు పౌడర్ బస్తాలు, గౌరీశంకర్‌కు చెందిన ట్యాంకర్, దేవదత్తుకు చెందిన ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. డీజిల్ తయారీలో ప్రధాన సూత్రధారి అయిన బ్రాహ్మాండ్లపల్లి దేవిదత్తు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ మొగిలయ్య, ఎస్‌ఐలు క్రాంతికుమార్, బాసిత్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement