నకిలీ నక్సలైట్ అరెస్ట్
లెటర్‌ప్యాడ్‌లు, డమ్మీ పిస్టల్ స్వాధీనం
మావోయిస్టు పార్టీ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో బెదిరింపులు
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి
ములుగు : మావోయిస్టు పార్టీ లెటర్‌ప్యాడ్‌లు తయారు చేసి, కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్, మావోయిస్టు నేత గోపన్న, ఇతర నాయకుల పేరుతో ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్‌ను బుధవారం ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దులగూడేనికి చెందిన పేరాల వెంకటేశ్ ములుగులోని మహర్షి కళాశాలలో పీజీ చేశాడు. తనకు అన్న వరుసైన చింతపండు నగేశ్ అలియాస్ క్రాంతి(పది నెలల కింద మృతిచెందాడు) సాయంతో మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతును పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నావని బెదిరించాడు. తర్వాత తాడ్వాయికి చెందిన తన స్నేహితుడు చింత సురేశ్(ప్రస్తుతం జైలులో ఉన్నాడు)తో కలిసి ఆ రైతు నుంచి రెండుసార్లు డబ్బులు వసూలు చేశాడు. ఏప్రిల్, మే నెలల్లో కూడా రెండుసార్లు సీపీఐ(మావోయిస్టు) లెటర్‌ప్యాడ్‌పై కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో లెటర్‌ను తయారు చేసి రైతును హెచ్చరిస్తూ గ్రామంలో వేశాడు. ఇటీవల చింత సురేశ్ సాయంతో రైతును భయపెట్టి రూ.3 లక్షలను ఏటూరునాగారం బస్టాండ్‌కు తీసుకురమ్మని బెదిరించాడు.
అంత పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేనని, కొంతమాత్రమే ఇస్తానని రైతు బతిమిలాడాడు. చివరికి రూ.60 వేలను కవరులో పెట్టి ఏటూరు నాగారం బస్టాండ్‌కు వేరే వ్యక్తి ద్వారా పంపాడు. ఈ నెల 16న సదరు వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వెంకటేశ్ డబ్బులతోపాటు రామన్నగూడెం మీదుగా మల్లూరువైపునకు పరార్ కాగా చింత సురేశ్ పట్టుబడ్డాడు. బుధవారం ఏటూరునాగారం అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంకటేశ్ పట్టుబడ్డాడు. వెంకటేశ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక ఆపరేషన్‌కు కృషిచేసిన ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, పస్రా ఎస్సై ఎస్‌కే యాసిన్‌ను ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
సిమ్ కార్డులు మార్చుతూ బెదిరింపులు..వెంకటేశ్, సురేశ్ తమ ఫోన్లో నిత్యం సిమ్‌కార్డులు మారుస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడేవారని ఏఎస్పీ తెలిపారు. ఇటీవల నియోజకవర్గంలో మావోయిస్టుల ప్రభావం పెరుగుతూ వస్తుండడంతో వీరు ధనార్జనే లక్ష్యంగా ముఠాగా ఏర్పడి పనిచేశారన్నారు. వెంకటేశ్ నుంచి మావోయిస్టుల పేరుతో ఉన్న లెటర్‌ప్యాడ్‌లు, ఓ డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకొని ఏటూర్‌నాగారం స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంకటేశ్‌ను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంట ఏటూరు నాగారం సీఐ రఘుచందర్, పస్రా ఎస్సై ఎస్‌కే యాసిన్ ఉన్నారు.