అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుదాం
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుదామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు.
– మూడేళ్ల పాలనలో టీడీపీ ప్రజలకు చేసిందేమీ లేదు
– వైఎస్‌ఆర్ హయాంలోనే పేదలకు లబ్ధి
– జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు తిరిగి వైసీపీ అభ్యర్థులకే
- కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక
ఆలూరు రూరల్/ఆలూరు: అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుదామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. శనివారం ఆలూరులో నియోజకవర్గస్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఆలూరు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్థానిక ఆస్పత్రి సర్కిల్ నుంచి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు కార్యకర్తలు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక సెయింట్‌జాన్స్ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల అభిమానం చూరగొనకుండా ఫ్యాక‌్షన్, హత్యా రాజకీయాలతో రాజ్యాధికారం కావాలనికోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శమమన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో గత ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. ఆ స్థానాల్లో తిరిగి వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు కూడా వైసీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.
గ్రామాల్లో తిరిగితే నిలదీస్తారు: సాయిప్రసాద్‌రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే
ఎన్నికల ముందు అన్నివర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేనిపోని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంతవరకు అమలు కాలేదు. టీడీపీ నాయకుల్లో గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు నిలదీసే రోజులు దగ్గరపడ్డాయి.
డబ్బుతో ఓటర్లను కొనలేరు: శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
అక్రమంగా సంపాదించిన డబ్బుతో వచ్చే ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ప్రజలు డబ్బుకు లొంగకుండా ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకునికే ఓట్లువేసి గెలిపించాలని కోరారు.
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఊరుకోం: బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే
తెలుగుదేశం ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఓడిపోయిన టీడీపీ నేతలకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంటూ నిధులు మంజూరు చేయడం దారుణం. వారి అరాచకాలు ఎన్ని రోజులూ సాగవు. అవసరమైతే తాము ఆ అరాచకాలను ఎదుర్కొనేందుకు ఎప్పుడు సిద్ధమే.
ప్రజా సంక్షేమమే ధ్యేయం: గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే
ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందారు. అలాంటినేత తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం తిరిగి రావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే రాజన్న రాజ్యం తిరిగి జగనన్న సాధిస్తాడు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తమ పార్టీకే మద్దతు తెలపాలి. తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.