వైట్‌గట్‌పై అప్రమత్తంగా ఉండాలి
-
కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య
నెల్లూరు రూరల్ : రొయ్యలకు సోకే వైట్‌గట్ వైరస్‌పై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య సూచించారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు లో ఎన్‌ఎఫ్‌డీబీ సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో రొయ్యల సాగు, సాంకేతిక ప్రక్రియలపై ఆక్వా రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కల్చర్ మొదలు పెట్టిన 20–30 రోజులకు వైట్‌గట్ లక్షణాలు కనబడతాయన్నారు. ఈ వైరస్ సోకిన ఐదు రోజులకే రొయ్య చనిపోతుందన్నారు. కల్చర్ ప్రారంభానికి ముందుగా చెరువులను ఎండబెట్టాలని, అలా చేయకపోవడంతో బాక్టీరియా లేదా ఫంగస్, నీటి టర్బిడిటి ఎక్కువగా ఉండటం ముఖ్య కారణాలన్నారు. రైతులు చెరువుల తయారీ పద్ధతుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి టర్బిడిటిని రోజుకు 20 శాతం నీటితో మార్పిడి ద్వారా వాంఛనీయ స్థాయిలో నిర్వహించుకోవాలన్నారు. వాటితో పాటు వైట్‌గట్‌కు ప్రోబయోటిక్స్ వాడుతూ ఉంటే కొంత వరకు నియంత్రించవచ్చన్నారు. కేవీకే మత్స్యవిభాగ శాస్త్రవేత్త ఝాన్సీలక్ష్మీబాయి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జేఆర్‌ఎఫ్ వెంకటేశ్వర్లు, ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు.