దీక్షపై దాడి
* నిరసనపై చెలరేగిన నిరంకుశత్వం
* కాపు ఉద్యమ నేత ముద్రగడ బలవంతంగా అరెస్టు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, హక్కుల పీకనొక్కి నిరంకుశంగా వ్యవహరించింది. శాంతియుతంగా దీక్ష చేపట్టిన ముద్రగడ అసలు ఎక్కడున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారనే విషయం కొన్ని గంటలపాటు ప్రజలకు తెలియకుండా చేసింది.
ముద్రగడ ఆమరణ దీక్ష, అనంతర పరిణామాలు ప్రజలకు తెలియకుండా సాక్షి టీవీలో ప్రసారాలను నిలిపివేయించింది. సెల్‌ఫోన్ల నుంచి సందేశాలు వెళ్లకుండా అడ్డుకుంది. దీక్ష కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది. గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఒకరకంగా యుద్ధ వాతావారణాన్ని సృష్టించింది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయించింది. సర్కారు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ముద్రగడ పురుగుల మందు తాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాజమహేంద్రవరం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు.
కుటుంబ సమేతంగా దీక్ష
కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. అప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పోలీసు బలగాలు ముద్రగడ ఇంటి చుట్టూ మోహరించాయి.
దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కాపు నాయకులు అడ్డుకున్నారు. తుని ఘటనలో అరెస్టయిన వారిలో వెఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారని చెబుతున్నారని, అమలాపురంలో అరెస్టయిన వారిలో టీడీపీ క్రియాశీలక కార్యకర్త దూడల మణి ఉన్నారంటూ అందుకు సంబంధించిన టీడీపీ సభ్యత్వ కరపత్రాన్ని ప్రదర్శించారు. ఈలోగా పోలీసు అధికారులు ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి వె ళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. ‘మీరు ఏదైనా మాట్లాడదలచుకుంటే ముద్రగడ కిటికీ వద్దకు వస్తారు. అక్కడే మాట్లాడండి’ అని కాపు నేతలు తేల్చిచెప్పారు.
ఆత్మహత్య చేసుకుంటా..
ఇదే సమయంలో పోలీసులు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఒకేసారి ముద్రగడ ఇంటి వరండాలోకి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. గదిలో తాను కూర్చున్న సోఫాలోంచి లేచి పురుగుల మందు డబ్బా పట్టుకొని కిటికీ వద్దకు వచ్చారు. ‘అడిషనల్ ఎస్పీగారూ! ఏమనుకుంటున్నారు? ఈ చుట్టుపక్కల పోలీసులు ఎవరైనా కనిపిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ‘మీకు సంబంధం లేదన్నారు కదా.. వెళ్లిపోండి. సీబీసీఐడీని రప్పించండి’ అని చెప్పి తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నారు.
69 కేసుల ఎఫ్‌ఐఆర్ కాపీలు చూపాలి
అనంతరం రాజమహేంద్రవరం నుంచి సీఐడీ డీఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం ముద్రగడ ఇంటికి చేరుకుంది. ముద్రగడను ఏ కారణంతో అరెస్టు చేయడానికి వచ్చారో చెప్పాలని కాపు నాయకులు పోలీసులను నిలదీశారు. ముద్రగడపై 69 కేసులు ఉన్నాయని హోంమంత్రి చినరాజప్ప చెబుతున్నారని, వాటి ఎఫ్‌ఐఆర్ కాపీలను తమకు అందజేస్తే అప్పుడు ముద్రగడ అరెస్టవుతార ని తెలిపారు.
తుని ఘటనలో నమోదైన కేసుల్లో రెండింటిలో దర్యాప్తు పూర్తయిందని, దానిపైనే అరెస్ట్ చేస్తామని సీఐడీ డీఎస్పీ హరికృష్ణ చెప్పారు. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీలు ఇస్తే అరెస్ట్‌కు ముద్రగడ సిద్ధమని కాపు నేతలు స్పష్టం చేశారు. సాంకేతికంగా కాపీలు ఇవ్వలేమని, లొంగిపోతే విచారణ సందర్భంగా అన్ని వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పడంతో కాపు నాయకులు నిరాకరించారు. చర్చలు లేవని, వెళ్లిపోవాలని పోలీసులకు చెప్పారు. మరోవైపు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
పోలీసులను ప్రతిఘటించిన నేతలు, అనుచరులు
దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైద్యబృందం గదిలోకి వెళ్లేం దుకు విఫలయత్నం చేసి, వెనుదిరిగింది. సాయంత్రం 4.20కి వందలాదిగా పోలీసులు మూకుమ్మడిగా ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాపు నాయకులు, ముద్రగడ అనుచరులు పోలీసులను ప్రతిఘటించారు. దీంతో పోలీ సులు లాఠీలకు పనిచెప్పారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు.
దాదాపు 60 మందిని అరెస్ట్ చేసి కాకినాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్ష చేస్తున్న గది నుంచి మరో గదిలోకి వెళ్లి అప్పటికే తన వద్ద ఉంచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు తలుపులను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిం చారు. ముద్రగడను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకొస్తుండగా ఆయన రెండో కుమారుడు గిరి అడ్డుకున్నారు. పోలీసులు ముద్రగడను బలవంతంగా అరెస్టు చేసి, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరిలను మరో వాహనంలో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముద్రగడ రాజమండ్రి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన రక్త నమునాలను వైద్యుల బృందం సేకరించి పరీక్షలు నిర్వహించింది. మెటాబాలిక్ డెఫిషియన్సీ 160 ఉన్నట్టు, ఆయన పురుగుల మందు తాగి నట్టు ఈ పరీక్షలో నిర్ధారణైంది. ముద్రగడ రక్తంలో చక్కెర స్థారుు 240 ఉందని, బీపీ 160/100 ఉందని.. వెంటనే ఆయనకు చికిత్స చేయకపోతే ఆరోగ్యం విషమించ వచ్చని వైద్యులు తెలపగా.. అందుకు ముద్రగడ ససేమిరా అంటున్నారు.