చేలు మాయం.. చెరువుల మయం
చేలు మాయం.. చెరువుల మయం
Published Fri, Jun 16 2017 1:38 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టాలో వరి చేలు మాయమవుతున్నాయి. సాగు భూములు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. అనధికారికంగా తవ్వుతున్న చెరువుల కారణంగా డెల్టా ప్రమాదంలో పడింది. నాలుగేళ్లుగా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గతంలో జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఆక్వా చెరువుల కారణంగా 5.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం వరి విస్తీర్ణం 4 లక్షల ఎకరాల లోపే ఉన్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టాలో పొలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు కాగా, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అధికారిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారికంగా మరో లక్ష ఎకరాల వరకూ చెరువులుగా మారినట్టు అంచనా.
అనుమతి లేనివే అధికం
ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, యలమంచిలి, పాలకొల్లు మండలా ల్లోని అత్యధిక విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందులో అనుమతి లేనివే అధికం. తాజాగా ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, పెరవలి, అత్తి లి మండలాల్లోనూ చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. డెల్టా మండలాల్లో ఏటా రెండు పంటలు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కాలంలో కొత్త వంగడాలు సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం, తెగుళ్లు తప్పడంతో దిగుబడి బాగా పెరిగింది. గతంలో రెండు పంటలకు 60 నుంచి 65 బస్తాల వరకూ దిగుబడి వస్తే.. ఇప్పుడు సగటున 80 బస్తాల వరకూ పెరిగింది. అయితే, సాగు భూములు మాత్రం తగ్గిపోయాయి.
ఆక్వా జోన్లుగా ప్రకటించడంతో..
ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా డెల్టాలోని కొన్ని మండలాల్లో అక్వా జోన్లను ప్రకటించింది. దీంతో ధనిక రైతులు వ్యవసాయం నుంచి అక్వా వైపు మళ్లుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఎక్కడా రొయ్యల చెరువులకు అనుమతి లేదు. ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు డెల్టాలోనూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లోని భూములన్నీ ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. ఉప్పునీటి బోర్లకు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తు్తన్నారు. సెలనిటి చాలకపోతే చెరువుల్లో నేరుగా బస్తాలకొద్దీ ఉప్పు కలుపుతున్నారు. రొయ్యల సాగు కోసం యాంటీబయోటిక్స్ సైతం అధికంగా వాడుతున్నారు. ఈ నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనినే చాలా గ్రామాల్లో తాగునీటికి ఉపయోగించాల్సిన దుస్థితి దాపురించింది.
పని దినాలు తగ్గిపోయాయి
ఆక్వా చెరువుల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ఆ భూముల్లో వరి సాగైన సమయంలో కూలీలకు సగటున 50 పని దినాలు ఉంటే అక్వా వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయాయి. దీంతో కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రొయ్యల చెరువులున్న గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఉప్పు నీటి కారణంగా పంటలు పండటం లేదు. దీనివల్ల రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టాలో వ్యవసాయ భూములు తగ్గిపోతుండటంతో కౌలు రేట్లు పెంచేశారు. గతంలో ఎకరానికి 24 బస్తాలు (రెండు పంటలకు కలిపి) ఉండే కౌలు ఇప్పుడు 32 నుంచి 34 బస్తాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అధికారిక గణాం కాల్లో తగ్గిన విస్తీర్ణం చూపించడం లేదు. గతంలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందో ఇప్పుడూ అంతే చూపిస్తున్నారు. వాస్తవానికి దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి కూడా పెరగాలి. అయితే, తగ్గిన విస్తీర్ణాన్ని చూపించకుండా అధికారులు పాత లెక్కలతోనే సరిపెడతున్నారు.
డెల్టా పరిరక్షణకు నడుం కట్టాలి
ఏటా పెరుగుతున్న అక్రమ చెరువుల కారణంగా డెల్టాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తిండి గింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
– కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం
Advertisement
Advertisement