చిత్తూరు : చిత్తూరు జిల్లా ప్రజలకు ఏనుగుల బెడద తప్పటం లేదు. తాజాగా రామకుప్పం మండలం బ్రహ్మదేవరచేను గ్రామ శివారులోని పంట పొలాలపై ఏనుగులు గత అర్థరాత్రి దాడి చేశాయి. పంటలను పూర్తిగా నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో వరి పంటతో పాటు అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అప్పు చేసి సాగు చేసిన పంటలను ఏనుగులు పొట్టనపెట్టుకుంటున్నాయని, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సోలార్ కంచె ఏర్పాటు చేసినా ఏనుగులు లెక్కచేయటం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగుల దాడితో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.