ప్రత్యేక గర్జన
ప్రత్యేక గర్జన
Published Wed, Aug 3 2016 12:56 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రోడ్డెక్కిన జనం
– జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణం
– వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు
– స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించిన ప్రజలు
– నిరసనకారులపై మితిమీరిన పోలీస్ జులుం
– అడుగడుగునా అరెస్ట్‌లు.. సుదూర ప్రాంతాలకు తరలింపు
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని, దాన్ని సాధించే వరకు ఉద్యమం ఆగదని ఆపార్టీ శ్రేణులు నినదించాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగడుతూ జనం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వీరికి వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలూ జతకలిశారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పలుచోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలను సైతం అరెస్టులు చేసి ఠాణాలకు తరలించారు. అయినా వెరవకుండా ఐక్యంగా ముందుకు కదిలారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :
ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ సీపీకి మద్దతుగా కాంగ్రెస్, వామపక్ష, ప్రజాసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పాటు వాణిజ్యసముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. ప్రజలు స్వచ్ఛందంగానే ప్రత్యేక హోదా బంద్‌కు మద్దతు పలకడం గమనార్హం. బంద్‌ను ఎలాగైనా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు పెద్ద ఎత్తున జులుం ప్రదర్శించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ, వామపక్ష, కాంగ్రెస్ ప్రజాసంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేçÙన్లలో ఉంచితే కార్యకర్తలు మరింత రెచ్చిపోతారని భావించి వారిని సుదూర ప్రాంతాలకు తరలించారు. బస్సులను అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ నేతలు, కార్యకర్తలను హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చిన నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌లు చేశారు. ఎమ్మెల్యేలని కూడా చూడకుండా మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేçÙన్లలో ఉంచారు. జిల్లావ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరిగింది.
– ఒంగోలులో పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. ఉదయం 4.30 గంటల దాదాపు 100 మంది కార్యకర్తలు వామపక్ష, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించారు. 6 గంటల ప్రాంతంలో డీఎస్పీ జి. శ్రీనివాసరావు పోలీస్ బలగాలతో వచ్చి బంద్ నిర్వాహకులను అరెస్ట్ చేసి కొత్తపట్నం పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. అనంతరం వందలాది మంది కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు, వామపక్ష నాయకులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాయి. ఆ తర్వాత నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
– గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు 6 గంటలకే అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేసి బేస్తవారిపేట పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. ఆ తర్వాత కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించడంతో పాటు రాచర్ల గేటు వద్ద రాస్తారోకో నిర్వహించారు. బ్యాంకులు, దుకాణాలు, పాఠశాలలను మూసివేయించారు.
– యర్రగొండపాలెం నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలు, వామపక్ష కార్యకర్తలతో కలిసి బంద్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరిగింది. దుకాణాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతబడ్డాయి. 11 గంటల ప్రాంతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ బంద్‌లో పాల్గొన్నారు.
– మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డిల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కార్యకర్తలు వాణిజ్యసముదాయాలు, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలన్నింటిని మూసివేయించారు. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి కొంతసేపటికి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
– కనిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి 1.30 గంటల వరకు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలను మూసివేయించారు.
– కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలు శింగారెడ్డి, వరికూటి కొండారెడ్డి, పి.వి.రమేష్‌యాదవ్, గంగిరెడ్డిల నేతృత్వంలో కార్యకర్తలు వామపక్ష కార్యకర్తలతో కలిసి టౌన్‌లో ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలను మూసివేయించారు.
– అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చెంచు గరటయ్య అందుబాటులో లేకపోవడంతో పార్టీ జిల్లా క్రమశిక్షణా సంస్థ కమిటీ సభ్యుడు జ్యోతి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటల నుంచి కార్యకర్తలు అద్దంకిలో ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు. అద్దంకి–నార్కెట్‌పల్లి రోడ్డు వద్ద బైఠాయించిన 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
– చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలు వరికూటి అమృతపాణి, యడం బాలాజీల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి బంద్ నిర్వహించారు. తొలుత ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలో దుకాణాలు, స్కూళ్ళు, బ్యాంకులు అన్నింటిని మూసివేయించారు. 12 గంటలకు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ బంద్ సంపూర్ణంగా జరిగింది.
– కొండపి నియోజకవర్గంలో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో కొండపిలో పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. వాణిజ్యసముదాయాలు, స్కూళ్లు, బ్యాంకులన్నింటిని మూయించారు. బస్సులను ఆపారు. టంగుటూరులో ఒంటి గంట ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
– పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త గొట్టిపాటి భరత్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వామపక్ష కార్యకర్తలు ఉదయం 10 గంటల నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్యసముదాయాలు, పాఠశాలలన్నింటిని మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు.
– సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, పార్టీ నేత దుంపా చెంచిరెడ్డిలు బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు, స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. 2 గంటల వరకు బంద్ జరిగింది.
– దర్శి నియోజకవర్గం సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూసివేయించారు. ఆర్‌టిసి బస్సులను అడ్డుకున్నారు. 12.30 గంటల వరకు బంద్ జరిగింది.
Advertisement
Advertisement