భారతీయ సంప్రదాయ వస్త్రాలతో పావురాన్ని ఎగురవేస్తున్న రవీంద్రారెడ్డి, గాబ్రియల్
ఎర్రెర్రని భావాలతో ఎరుపెక్కిన కళ్లతో తెలుగు నాట రక్తపు చుక్కలు చిందించి జర్మనీలో ఎర్ర కపోతాన్ని ఎగరేశాడు ఓ తెలుగు తేజం. పదిహేనేళ్ల వయస్సులో పోరాటాల భూమిలో అడుగెట్టి జైలు జీవితం గడిపిన చరిత్ర ఆయనది. ఆ అడుగులు దేశాన్ని దాటి విదేశాల్లో ఓ ప్రభంజనం సృష్టించాయి. ‘పనిచేసే వాడే పాలకుడు’ అన్న నినాదంతో పాతకేళ్లుగా జర్మనీలో తిరుగులేని కమ్యూనిస్టు లీడర్‌గా కొనసాగుతున్న మన కనిగిరి నిప్పు కణిక గుజ్జుల రవీంద్రారెడ్డిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ప్రజలు ఓ నాయకుడిని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్నారంటే.. దానికి కారణం కేవలం ఆ నాయకుడు ప్రజలకు చేస్తున్న సుపరిపాలనే. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజలకు చేసిన మంచి పనులే మళ్లీ మళ్లీ నన్ను ఎన్నుకునేలా చేశాయని నేను అర్థం చేసుకున్నాను. – గుజ్జల రవీంద్రారెడ్డి
సాక్షి, పీసీపల్లి: పోరాట ప్రతిమతో ప్రపంచాన్ని ఈదొచ్చని నిరూపించాడు మన కనిగిరి విప్లవ కెరటం గుజ్జుల రవీంద్రారెడ్డి. తెలంగాణలోని భద్రాచలంలో పుట్టిన గుజ్జల రవీంద్రారెడ్డి స్వస్థలం పీసీపల్లి మండలంలోని ఓ మారుమూల గ్రామమైన నేరేడుపల్లి గ్రామం. రవీంద్రారెడ్డి పెరిగింది, ప్రాథమిక విద్యాభ్యాసం సాగిందంతా కనిగిరిలోనే. ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు నేత గుజ్జుల యలమందారెడ్డి, తల్లి సరళాదేవి ఓ మహిళా కార్యకర్త. రవీంద్రారెడ్డి 1 నుంచి 7వ తరగతి వరకు కనిగిరి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశాడు.
కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం..
రవీంద్రారెడ్డి తండ్రి గుజ్జుల యలమందారెడ్డి సీపీఐ తరఫున కనిగిరి ఎమ్మెల్యేగా మూడు సార్లు, ఒంగోలు ఎంపీగా ఒకసారి గెలుపొందారు. తండ్రి ప్రభావం రవీంద్రాపై బలంగా పడింది. ఎలానైనా సోషలిస్ట్ ఐడియాలజీతో సోషలిస్ట్ దేశాల్లో ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీలో ఏడాదిపాటు బీకాం చదవాడు. బీకాం వదిలేసి జర్మనీలో మెడిసిన్ చేయాలని నిర్ణయించుకుని 1973 డిసెంబర్‌లో జర్మనీ వెళ్లాడు. ఏడాదిపాటు జర్మనీ భాషను నేర్చుకుని ఆ తర్వాత అక్కడ మెడిసిన్‌లో చేరాడు. మెడిసిన్ చదువుతున్న రోజుల నుంచే సోషలిస్ట్ భావాలు ఆయన్ను నిరంతరం కదిలిస్తూ ఉండేవి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ఉద్యమాలు కొనసాగించేవాడు.
పదిహేనేళ్ల వయస్సులోనే జైలుకు..
చిన్నతనం నుంచే రవీంద్రారెడ్డి ప్రగతిశీల భావాలతో, సమసమాజం కోసం నిరంతరం పోరాటం చేశాడు రవీంద్రారెడ్డి. పదిహేనేళ్ల వయస్సులో దున్నేవాడిదే భూమి అంటూ నినదించి ఆ పోరాటంలో జైలుకు వెళ్లాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో హైదరాబాద్‌లో అమూల్ బేబీ ఫుడ్ బ్లాక్ మార్కెట్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి మరోసారి జైలుకు వెళ్లాడు. జర్మనీలో మెడిసిన్ చేసే సమయంలో పలువురు విదేశీ విద్యార్థులతో కలిసి పోరాటాలు చేశాడు. ఆఫ్రికాలో రోడీషా నల్లవారికి హక్కుల కోసం ఉద్యమించాడు. పాలస్తీనా ప్రత్యేక దేశం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్నాడు. వియత్నాంపై అమెరికా యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఉద్యమాల్లో ఉంటూనే బెర్లిన్‌లో మెడిసిన్ పూర్తి చేసి తన సేవలు కొనసాగించాడు.
జర్మనీలో సంప్రదాయ దుస్తుల్లో ఏనుగు వద్ద రవీంద్రారెడ్డి
రాజకీయాల్లో తొలి అడుగే మేయర్‌గా..
1990వ సంవత్సరం వరకు ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండటంతో రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ రవీంద్రా పోటీ చేయలేకపోయాడు. 1993లో జర్మనీ సిటిజన్‌షిప్ రావడంతో ఏకంగా అల్టాండ్స్‌బర్గ్‌కి మేయర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు. వరుసగా ఐదుసార్లు మేయర్‌గా విజయాన్ని అందుకుని 2019 వరకు అక్కడి ప్రజల మన్ననలు పొందాడు. జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఓ భారతీయుడు ఏకంగా 25 సంవత్సరాల పాటు మేయర్‌గా ఉండి రవీంద్రారెడ్డి చరిత్ర సృష్టించాడు. మేయర్‌గా కొనసాగుతూనే 2004 నుంచి 2009 వరకు జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో జర్మన్ ప్రభుత్వం సాయంతో ఆయన కృష్ణాజిల్లా అవనిగడ్డలో స్కూల్స్, షెల్టర్స్, వంతెనలు, మరుగుదొడ్లు, జాలర్లకు భవనాలు నిర్మించి ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని సముద్రపు ఒడ్డున జాలర్లకు కట్టించిన 220 ఇళ్ల ఓ కాలనీకి రవీంద్రనగర్ అని పేరు పెట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment