ఉత్సాహం నింపిన ‘గీతం’ వేడుక
-
భారతరత్న ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావుకు ‘గీతం’ ఫౌండేషన్ అవార్డు
-
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
-
ఉత్తేజ పరిచిన ప్రముఖుల ప్రసంగాలు
సాగర్‌నగర్ : విద్యారంగంలో జాతీయస్థాయి కీర్తి ప్రతిష్టలను ఇనుమండింపజేస్తున్న గీతం విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ,జాతీయస్థాయి ప్రముఖుల ప్రసంగాలతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో జరిగిన ఉత్సవంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అధ్యాపకులు తరలివచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత రసాయనశాస్త్ర పరిశోధకుడు, భారతరత్న ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావు(ఫ్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు)కు గీతం అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి గీతం ఫౌండేషన్ అవార్డుతోపాటు 10 లక్షల రూపాయల అవార్డు మొత్తాన్ని అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ సీ.ఎన్.ఆర్.రావు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం దేశంలో శాస్త్ర విజ్ఞానానికి గల ప్రాధాన్యతను ఆలోచింప చేసింది. గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తి మాట్లాడుతూ బోధన, పరిశోధన ద్వారా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారతరత్న ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావును గీతం ఫౌండేషన్ అవార్డుతో సత్కరించడం గీతంకు లభించిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. గీతం చాన్స్‌లర్ పొఫెసర్ కె. రామకష్ణారావు మాట్లాడుతూ యువతరం స్వదేశీ భావనను అర్థం చేసుకుని అనుసరించాలని సూచించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ 36ఏళ్ల గీతం విశ్వవిద్యాలయం తన ప్రతిభను జాతీయ, రాష్ట్రస్థాయిలో అరుదైన విశిష్ట ముద్రను ఉన్నత విద్యారంగంపై నిలిపిందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు గీతంలో 16 పేటెంట్లు నమోదు అయ్యాయని మరో 40 పరిశోధనల ఫలితాలపై పేటెంట్లకు రిజిస్టర్‡ చేశామని వెల్లడించారు. ఈ ఏడాది వివిధ అధ్యాయనాలకు గాను 11 పరిశోధనా కేంద్రాలను గీతం వర్శిటీలోని మూడు ప్రాంగణాల్లోను నెలకొల్పొతున్నట్టు ప్రకటించారు.
ప్రతిభకు పట్టం
గీతం విశ్వవిద్యాలయం ఉత్తమ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ప్రతిభకు ఉత్తమ అవార్డులు అందజేశారు. పరీక్షా విభాగంలో సేవలు అందిస్తున్న ఎం. బాలసుబ్రహ్మణ్యం, విశ్వవిద్యాలయంలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వి.శంకరరావులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన బెస్ట్ స్పీకర్ అవార్డు పోటీల్లో విజేతలుగా నిలిచిన న్యాయ కళాశాల విద్యార్థిని జి.సాయి, కార్తిక్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రియా గుహ,హైదరాబాద్ బిజినెస్ స్కూల్ విద్యార్థిని ఎస్.సందతి బహుమతులు అందుకున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక సంబరాలు
వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కష్ణాష్కరాలలో ప్రత్యేక శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్న గీతం విద్యార్థిని పి.వి.ఎన్.ఎల్.శ్రావణి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, గీతం ఉపా«ధ్యక్షుడు ప్రొఫెసర్ కె. గంగాధరరావు, ప్రోవైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. శివరామకష్ణ, ప్రొఫెసర్లు ఎన్. శివప్రసాద్, పి.వి.శివపుల్లయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు, గీతం కార్యదర్శి బి.వి.మోహన్‌రావు, కోశాధికారి బి.ఎస్.ఎన్.రాజు, వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.