
ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం స్వాధీనం!
♦ రెండు నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ
♦ అప్పగించేందుకు అంగీకరించని ఆలయ పాలకమండలి
♦ విశాఖ పీఠానికి అప్పగించినందున స్వాధీనం సరికాదంటూ వాదన
♦ సూమోటో ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లోని ప్రసిద్ధ దైవ సన్నిధానాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించింది. చలనచిత్ర, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆలయ పాలక మండలి సభ్యులుగా ఉండటం.. స్వాధీన ప్రక్రియకు వారు తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నా దేవాదాయ శాఖ వెనకడుగు వేయకపోవటం... వెరసి ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయాన్ని దేవాదాయ శాఖ చట్టం మేరకు దానికి స్వాధీనం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆ శాఖ నోటీసుకు ఆలయ పాలక మండలి స్పందించకపోవటంతో... చట్టంలో ఉన్న వెసులుబాటు ఆధారంగా సూమోటోగా అధికారులే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. పాలకమండలి సభ్యుల మధ్య పొడచూపిన విభేదాలే ఇప్పుడు ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు రావటం విశేషం.
ఇదీ నేపథ్యం...
జూబ్లీహిల్స్‌లో దాదాపు మూడున్నర వేల చదరపు గజాల విస్తీర్ణంలో దైవ సన్నిధానం పేరిట ఆలయాల సమూహం నిర్మితమైంది. అనతి కాలంలోనే ఆలయానికి ప్రాచుర్యం వచ్చింది. ముఖ్యంగా ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల రాకతో హడావుడిగా ఉంటుంది. ఆలయ పాలకమండలిలో దాదాపు అంతా ప్రముఖులే ఉన్నారు. ఈ తరుణంలో 2012లో పాలకమండలి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో కొందరు పాలకమండలి సభ్యులు ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పెద్దమొత్తంలో వస్తున్న ఆదాయాన్ని పక్కదారిపట్టిస్తున్నారని ఇద్దరు పాలకమండలి సభ్యులు దేవాదాయశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా అప్పట్లోనే ప్రభుత్వం ఆదేశించటంతో ఆ శాఖ ఇన్‌స్పెక్టర్లు విచారణ ప్రారంభించారు.
కొద్దిరోజుల క్రితం అధికారులు కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. కీలకమైన ఆదాయ ఖాతా వివరాలు ఇవ్వటంలో ఆలయ నిర్వాహకులు సహకరించటం లేదని, ఆలయాన్ని విశాఖపట్టణంలోని శారదాపీఠానికి బదలాయించినందున వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారని, అక్కడి పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ అందులో అధికారులు పేర్కొన్నారు. ఆలయానికి అవసరమైన 3,200 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చినందున దాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు డి1-2416/2012 నెంబరుతో తాజాగా ఆల య పాలకమండలికి స్వాధీన నోటీసు జారీ చేశారు. ఆలయాన్ని విశాఖ శారదా పీఠానికి కేటాయించినందున దాని స్వాధీనం సరికాదంటూ పాలకమండలి సభ్యులు దేవాదాయశాఖ దృష్టికి తెచ్చారు. ఆలయ బదలాయింపునకు దేవాదయ శాఖ అనుమతి తీసుకోనందున అది చెల్లదని, వెంటనే దేవాదాయశాఖ పరిధిలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఆ శాఖ మరో నోటీసు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవటంతో దేవాదాయ శాఖ చట్టంలోని సూమోటో సెక్షన్ ఆధారంగా అధికారులే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు.