- 26న పాదయాత్ర జరిగి తీరుతుంది
- ఇంటికొకరు కదలిరండి
- చావో...రేవో తేల్చుకుందాం
- కాపు ఉద్యమనేత ముద్రగడ పిలుపు
ఇదే ఆఖరి పోరాటం
Published Wed, Jul 12 2017 12:05 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
పిఠాపురం టౌన్:
ఇంటికొచ్చి నిద్రలేపి కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగితే అణిచివేసే కార్యక్రమాలు చేపడతున్నారని, అవమానాలకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కల్యాణ మంటపంలో కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీకి రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చేపట్టి సరిగ్గా రెండేళ్లు కావస్తుందని, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సీఎంకు చీమకుట్టనట్టు నటిస్తున్నారన్నారు. ఈ నెల 26న పాదయాత్ర జరిగి తీరుతుందని ఇదే ఆఖరి పోరాటం, ఆకలి పోరాటం అని ఆయన అన్నారు. కాపులు, బిసీలు, దళితుల మధ్య తగాదాలు సృష్టించి రాజకీయంగా ఎదగాలని చంద్రబాబు చూస్తున్నారని ఈ కుట్ర అందరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో ఎంతో మంది కాపులు ఓట్లు వేసి చంద్రబాబును గెలిపిస్తే ఇప్పుడు కాలుతో తన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడుతున్నా...చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యామన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న కాపు సోదరులను కూడా కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో మన రక్షణ కోసం ఇంటికొకర్ని పంపిస్తున్నారని, అదేవిధంగా కాపు ఉద్యమం కోసం ఇంటికొకర్ని పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాపుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను, క్రీడాకారులను ముద్రగడ చేతులు మీదుగా ఘనంగా సత్కరించారు. రాష్ట్ర కాపు ఐక్యవేదిక సభ్యుడు గుండా వెంకటరమణ, ఆదర్ష్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంటు బుర్రి అనుబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement