మాటరాని మౌనం! | final stage of veternary hospitals | Sakshi
Sakshi News home page

మాటరాని మౌనం!

Published Tue, Jul 25 2017 10:33 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మాటరాని మౌనం! - Sakshi

మాటరాని మౌనం!

పశువైద్యం.. దైవాధీనం
- పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం
- 20 కిలోమీటర్లు వెళ్లినా కనిపించని ఆసుపత్రులు
- వైద్యం మండల, నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం
- అరకొర మందులు, శిథిల భవనాలు
- ప్రబలుతున్న అంతుచిక్కని వ్యాధులు


పశువులు, జీవాల వివరాలు
ఆవులు, ఎద్దులు     06.61 లక్షలు    
గేదెలు             03.70 లక్షలు    
గొర్రెలు             38.79 లక్షలు
మేకలు             07.85 లక్షలు    
కోళ్లు             18.26 లక్షలు
పందులు         21,800        
కుక్కలు             85,500        
గాడిదలు         6,200    


ఆస్పత్రులు
వెటర్నరీ పాలీక్లినిక్‌ (వీపీసీ)            :  01
పట్టణ పశువైద్యశాలలు    (వీహెచ్‌లు)        :  30
మండలస్థాయి వైద్యశాలలు (వీడీలు)        : 121
గ్రామీణ పశుచికిత్సాకేంద్రాలు (ఆర్‌ఎల్‌యు)    :  37
గోపాలమిత్ర కేంద్రాలు                : 362

పోస్టులు, ఖాళీల వివరాలు
హోదా                పోస్టులు    ఖాళీలు
డిప్యూటీ డైరెక్టర్లు        07        06
అసిస్టెంట్‌ డైరెక్టర్లు        43        03
పశువైద్యాధికారులు    128        15
కాంపౌండర్లు        113        56
జేవీవోలు        22        05
ఆఫీస్‌ సబార్టినేటర్లు    140        57

+ అనంతపురం రూరల్‌ మండలం చియ్యేడులో నాలుగు నెలలుగా పశువైద్యాధికారి లేరు. ఈ కారణంగా చియ్యేడుతో పాటు పూలకుంట, కృష్ణమరెడ్డిపల్లి, దుర్గం, మన్నీల, ఇటుకలపల్లి, యర్రాయపల్లి తదితర గ్రామాలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. పశు సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి. ఇలాంటి చోట వైద్యాధికారి లేకపోవడం చూస్తే ఈ శాఖ పనితీరు ఇట్టే అర్థమవుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోనే పరిస్థితి ఇలావుంటే.. మారుమూల ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

అనంతపురం అగ్రికల్చర్‌: పశువైద్యం గాలిలో దీపంగా మారింది. వైద్యులు, కాంపౌండర్ల కొరతతో పాటు శిథిలమైన భవనాలు.. ఖరీదైన మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యం దైవాధీనం అవుతోంది. అంతుచిక్కని రోగాలు.. అంటువ్యాధులు ప్రబలుతుండటంతో సకాలంలో వైద్యం అందక విలువైన పశుసంపద మృత్యుబారిన పడుతోంది. వైశాల్యం.. పశు, జీవాల సంఖ్యలో అనంత అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే సరైన మౌలిక వసతులు, వైద్య సేవలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాలో పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తి తిరోగమనంలో పయనిస్తోంది. జిల్లాలో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు తదితరాలన్నీ కలిపి 60లక్షలకు పైబడి మూగ జీవాలు ఉన్నాయి. కోళ్ల సంఖ్య 18.50 లక్షలు. కానీ.. పశువైద్య శాలలు మాత్రం 189 మాత్రమే. పశువులు, జీవాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఆసుపత్రులు లేకపోవడం సమస్యకు కారణమవుతోంది. జబ్బు చేస్తే 20 కిలోమీటర్ల దూరం వెళ్లినా ఆసుపత్రులు కనిపించని పరిస్థితి. కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో 250 చొప్పున పశు చికిత్సా కేంద్రాలు ఉండగా.. ఇక్కడ 37 మాత్రమే ఉండటం గమనార్హం.

అరకొర మందులే..
మందుల విషయానికొస్తే జబ్బు చేసిన వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా కొన్ని ఆస్పత్రుల్లో అత్యవసర మందులు(లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌) ఉండని పరిస్థితి నెలకొంది. ప్రతి మూడు నెలలకోసారి సుమారు 60 నుంచి 80 రకాల మందులు సరఫరా అవుతుంటాయి. పశుసంపద, జీవాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేసినా.. త్వరగా అయిపోతుండటంతో ఆ తర్వాత ఇబ్బందులు తప్పట్లేదు. ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలో ఉన్న ఆస్పత్రులకు రూ.45 లక్షల విలువ చేసే మందులు సరఫరా చేస్తున్నట్ల ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మందుల జాబితాలో ఖరీదైన మందులు లేకపోవడంతో ప్రజలు, రైతులు బయట మందుల షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.

థైలేరియా(మలేరియా లాంటి వ్యాధి), గర్భకోశ వ్యాధులు, పొదుగువాపు వ్యాధి, కుక్కలకు సంబంధించి రేబిస్‌ టీకాలు, మరికొన్ని మందులతో పాటు ముఖ్యమైన యాంటీబయాటిక్స్, సెలైన్స్, నొప్పి నివారణ(పెయిన్‌కిల్లర్స్‌) మందుల కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నీలినాలుక, గిట్టపుండ్ల వ్యాధి, బొబ్బవ్యాధి, పీపీఆర్‌(పారుడురోగం), బ్రూసెల్లోసీన్, దొమ్మ(అంత్రాక్స్‌), గొంతువాపు, నట్టల నివారణ(డీవార్మింగ్‌) తదితర అంటువ్యాధులు, హానికరమైన జబ్బులకు సంబంధించి ఏటా సీజన్ల వారీగా ఉచితంగా టీకాలు వేస్తున్నా.. మధ్య మధ్యలో వ్యాధులు సోకితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి ఎక్కువగా కుక్కలు, పిల్లులను చికిత్స కోసం తీసుకొస్తారు. అయితే వీటికి సంబంధించిన మందులు పరిమితంగా వస్తుండటంతో బయటకు రాసిచ్చే పరిస్థితి నెలకొంది. పశువులు, జీవాలు తక్కువగా ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో సరఫరా అవుతున్న మందులు మిగిలిపోతుండంతో.. కాలం చెల్లిపోయినట్లు తెలిసినా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

శిథిల భవనాల్లో వైద్య సేవలు
ఆస్పత్రి భవనాలు కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యవసర మందులు, వీర్యం లాంటివి నిల్వ చేసుకునేందుకు, వైద్యం చేసేందుకు సరైన వసతులు కూడా కొన్ని చోట్ల అంతంత మాత్రమే. రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌ఐడీఎఫ్‌) కింద భవన నిర్మాణాలు, మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు చెబుతున్నా పూర్తయినవి తక్కువగానూ, సంవత్సరాల తరబడి వివిధ దశల నిర్మాణాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం.  

ఇబ్బందులు వాస్తవమే..
పక్క జిల్లాలతో పోలిస్తే ఆస్పత్రులు, డాక్టర్లు, కాంపౌండర్ల కొరత ఇక్కడ ఎక్కువే. ముఖ్యంగా గ్రామీణ చికిత్సా కేంద్రాలు మరీ తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఎక్కడా వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇన్‌చార్జీలను నియమించి పర్యవేక్షణ సాగిస్తున్నాం.
- డాక్టర్‌ బి.సన్యాసిరావు, పశు సంవర్ధక శాఖ జేడీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement