• 35 వేల లీటర్లకు పడిపోయిన రోజువారీ పాలసేకరణ
• వేతనాలు లేక మొక్కుబడిగా పనిచేస్తున్న అధికారులు
• రూ.30 లక్షలకు పైగా నష్టాలు మూటగట్టుకున్న డెయిరీ
అనంతపురం అగ్రికల్చర్ : పదేళ్ల కిందటే 60 నుంచి 70 వేల లీటర్ల పాలసేకరణతో ఓ వెలుగు వెలిగిన ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) ఇపుడు పతనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ డెయిరీని చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో సంక్షోభం దిశగా పయనిస్తోంది. దీంతో ప్రభుత్వ డెయిరీని నమ్ముకుని పాలు పోస్తున్న రైతులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మలేని పాడి రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే అదనుగా అటు ప్రభుత్వ డెయిరీ, ఇటు ప్రైవేట్ డెయిరీలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా రైతుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన పాడి పరిశ్రమ తిరోగమన దిశలో పయనిస్తోంది.
35 వేల లీటర్లకు పడిపోయిన పాల సేకరణ
అనంతపురం, హిందూపురం డెయిరీల సామర్థ్యం 1.20 లక్షల లీటర్లు. గత ఫిబ్రవరి, మార్చిలో రెండింటి పరిధిలో రోజూ 65 వేల లీటర్ల పాలను సేకరిస్తుండేవారు. ప్రస్తుతం 35 వేల లీటర్లకు పడిపోయాయి. అంటే ఆరు నెలల్లోనే ఏకంగా 30 వేల లీటర్లు తగ్గిపోవడం విశేషం. వేసవిలోనే ఆ స్థాయిలో పాలు వస్తుండగా.. ఇపుడు వర్షాకాలంలో పెరగాల్సింది పోయి తగ్గిపోవడం చూస్తే డెయిరీ పయనం ఏ దిశగా ఉందో అర్థమవుతోంది. హిందూపురం పరిధిలో కొంత మెరుగ్గా ఉండగా.. అనంతపురం పరిధిలో పూర్తిగా ప్రైవేట్‌పరం అయిపోయినట్లు కనిపిస్తోంది. డీఆర్‌డీఏ–వెలుగు డెయిరీల్లో కూడా పాల సేకరణ భారీగా తగ్గిపోయింది. కొత్తచెరువు, తాడిపత్రి, బ్రహ్మసముద్రం, పామిడి, అమడగూరు తదితర బీఎంసీల్లో పాల సేకరణ పూర్తిగా తగ్గిపోయింది. నార్పల, శెట్టూరు, ఓడీ చెరువు, పెనుకొండ, నల్లచెరువు లాంటి బీఎంసీల్లో నామమాత్రంగా పాలు వస్తున్నాయి. గుడిబండ, రొళ్ల, ధర్మవరం, కళ్యాణదుర్గం, మడకశిర, అగళి లాంటి కొన్ని బీఎంసీల పరిస్థితి మాత్రమే మెరుగ్గా ఉంది.
ఏప్రిల్, మే నెలల్లో రూ.11 కోట్ల పాల బకాయిలు ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున చేసిన ఆందోళనకు దిగివచ్చిన సర్కారు ఎలాగోలా చెల్లింపులు చేసింది. లేదంటే ఈ పాటికి డెయిరీకి తాళం వేసే పరిస్థితి ఉండేదంటున్నారు. గతంలో డెయిరీకి 12 వేల మందికి పైగా రైతులు పాలు పోస్తుండగా.. ఇపుడు 7 వేల మందికి పడిపోవడం గమనార్హం. సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని తెలియడంతో చాలా మంది రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గుచూపారు. పాలలో నీళ్లను వేరు చేసి సరఫరా చేయడానికి వీలుగా రూ.2 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్‌వో ప్లాంటు నిరవధికంగా మూతబడిపోయింది.
వేతనాలు లేక అవస్థలు
ఓ వైపు రైతుల పరిస్థితి దారుణంగా ఉండగా.. మరోవైపు డెయిరీ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలలుగా వారికి వేతనాలు లేవు. దీంతో అధికారులు, సిబ్బంది మొక్కుబడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం డెయిరీ ప్రస్తుతం రూ.30 లక్షలకు పైగా నష్టాల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు పైకి చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఇక డెయిరీ డీడీ నాగేశ్వర్‌రావు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. డీడీ కూడా విరమణ చేస్తే కొత్తగా ఇక్కడకు రావడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. మొత్తమ్మీద డెయిరీ పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతోంది.
పతనావస్థలో ప్రభుత్వ డెయిరీ
Published Sun, Sep 11 2016 12:10 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement
Advertisement