
అమ్మితే రూ.25 వేలు.. తాగితే రూ.10 వేలు
నవాబుపేట: మద్యం క్రయవిక్రయాలను ఆ గ్రామస్తులు నిషేధించారు. అతిక్రమించి ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా జరిమానా చెల్లించక తప్పదని ఏకగ్రీవంగా తీర్మానించారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మాదారం గ్రామం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని కిరాణం దుకాణాల్లో విచ్చలవిడిగా మందు తాగి కొందరు గొడవలకు దిగుతున్నారు. ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గ్రామస్తులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చారు. మంగళవారం గ్రామ పంచాయతీ సభ్యులు, మహిళలు, యువజన సంఘాలు, గ్రామ పెద్దలు, సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో మద్యం అమ్మరాదని నిర్ణయించారు. అందుకు అందరూ సమ్మతించారు. సహకరిస్తామని చెప్పారు. ఇకపై ఎవరైనా మద్యం అమ్మితే రూ.25000, కొనుగోలు చేసే రూ.10000 జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు తయారైన తీర్మానంపై గ్రామస్తులు, కిరాణ షాపుల యజమానులు సంతకాలు చేశారు.