ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఆ పార్టీ ముఖ్యనేతలు పాలుపంచుకున్నారు.
గుంటూరు నుంచి సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఆ పార్టీ ముఖ్యనేతలు పాలుపంచుకున్నారు. తమ ప్రసంగాల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటులో తీర్మానం చేశాయి. దేశ ప్రజలు మోదీ నాయకత్వ లక్షణాలు చూసి గెలిపించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలి’ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
చంద్రబాబు పాలన ‘బాహుబలి’ సినిమాలో బళ్లాల దేవుడి పాలనను తలపిస్తోందని.. చంద్రబాబు కట్టప్పలా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ప్రజలకు సైతం వెన్నుపోటు పొడుస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కాలకేయుడులా రాక్షస మూకతో రాష్ట్రంపై దండ యాత్ర చేస్తున్నారని.. వీరి ఆట కట్టించేందుకు జగన్ బాహుబలిలా వస్తున్నారని చెప్పారు. జగన్ దీక్షతో తెలుగుదేశం నేతల వెన్నుల్లో వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
జగన్ చేస్తున్న దీక్షకు ప్రతిపక్షాలు, వామపక్షాలు, వాణిజ్య సంఘాలు, విద్యార్థుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోందని చెప్పారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోంది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులేనని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. హోదా అనేది ఎవరో వేసే భిక్ష కాదని.. అది మన హక్కని వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం చెప్పారు. చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని.. వెంకయ్యనాయుడికి సిగ్గూశరం ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావాలని మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. ప్యాకేజీలు మనకొద్దని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా హోదాతోనే సాధ్యమని తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. పార్టీలకతీతంగా మహోద్యమాన్ని సృష్టిద్దామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.