ఫిట్‌లెసే..
- యథేచ్ఛగా తిరుగుతున్న స్కూల్ బస్సులు
- కండిషన్ లేకపోయినా రోడ్డెక్కుతున్న 127 బస్సులు
- ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీఏ అధికారుల హడావిడి
- యాజమాన్యాలకు పట్టదు
- అధికారులు తొంగిచూడరు
- ఆందోళనలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు
సంగారెడ్డి టౌన్:ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను యథేచ్ఛగా రోడ్డెక్కిస్తున్నాయి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు కండీషన్‌లో లేకపోవడం, అనుభవం లేని డ్రైవర్లు నడపడం వంటి కారణాలతో సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో వందకుపైగా బస్సులు రోడ్లపై చక్కర్లు కొడుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ రోజు, ఎక్కడ, ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.
స్కూళ్లు ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నా జిల్లాలో ఇంకా ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో తనిఖీల పేరిట హడావిడి చేసిన ఆర్టీఏ అధికారులు ప్రస్తుతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు స్కూల్ బస్సులు 1,438 ఉండగా అందులో 1,195 ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
116 బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి దాటినందున వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. ఫిట్‌నెస్ లేని బస్సులు ఇంకా 127 మిగిలినట్టు తెలుస్తోంది. అంటే ఈ బస్సుల్లో ప్రయాణం ప్రమాదకరమని తల్లిదండ్రులు గమనించాలని అధికారులే సూచించారు. నిబంధనలకు అనుగుణంగా లేని ప్రైవేటు పాఠశాలల బస్సుల విషయంలో కఠినంగా వ్యవహారించాలని ప్రభుత్వం చెప్పినా.. వందకు పైగా బస్సులు ఇంకా రోడ్డు మీద తిరుగుతుండడం గమనార్హం.
జూలై 2న ఫిట్‌నెస్ పొందిన సంగారెడ్డిలోని కాకతీయ పాఠశాల బస్సు అనుభవం లేని డ్రైవరు నడపడంతో కొండాపూర్ మండలం అలియాబాద్ శివారులో చెట్టును ఢీకొంది. ప్రాణ నష్టం జరగకపోయినా పదుల సంఖ్యలో చిన్న పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఫిట్‌నెస్ పొందిన బడి బస్సుల పరిస్థితి ఏ పాటిదో అర్థమవుతోంది.