స్కూలు ఆటోల సంగతేంటి? | Many schools do not have transport ... | Sakshi
Sakshi News home page

స్కూలు ఆటోల సంగతేంటి?

Published Tue, Jun 21 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

స్కూలు ఆటోల సంగతేంటి?

స్కూలు ఆటోల సంగతేంటి?

రవాణా సౌకర్యం లేని స్కూళ్లు ఎన్నో...
స్కూలు ఆటోలకు నిర్ణీత చార్జీలు, నిబంధనలు లేనే లేవు...
ఫిట్‌నెస్, చిన్నారుల భద్రత గాలికి...
మాఫియాగా సాగుతున్న ‘వసూళ్ల’ వ్యవహారం

 

 సిటీబ్యూరో: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి... స్కూలు బస్సుల వల్ల జరుగుతున్న ప్రమాదాలను ఆర్టీఏ పరిగణనలోకి తీసుకుంది... ఫిట్‌నెస్ లేని బస్సుల్ని సీజ్ చేయడంతో పా టు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అల్టిమేటం ఇచ్చింది... ఇంత వరకు బాగానే ఉంది. నగరంలో స్కూలు బస్సులకు అనేక రెట్లు ఆటోల్లో విద్యార్థుల రవాణా జరుగుతుంటుంది. వీటిలో ఆరుగురి కంటే ఎక్కువ తరలించరాదంటూ కొన్ని నిబంధనలు విధించిన అధికారులు, కీలకమైన పలు అంశాలను విస్మరిస్తున్నారు. ఏళ్లుగా ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అటు ఆర్టీఏ, ఇటు ట్రాఫిక్ పోలీసులు వీటిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

 
ఆటో సేఫ్టీ గాలిలోనే...

స్కూలు బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్లకు అర్హతలు అంటూ గొంతు చించుకుంటున్న ఆర్టీఏ, ఆటోల్లో ఆరుగురే అంటూ విరుచుకుపడుతున్న ట్రాఫిక్ అధికారులు ఓ కీలకమైన అంశం విస్మరిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులను మాత్రమే తరలిస్తున్న ఆటోల్లో ఫిట్‌నెస్ ఎంత వరకు ఉంది? సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి? అనే విషయాలు ఎవరికీ పట్టట్లేదు. తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తూ పసివాళ్లను తరలించే ఆటోలకూ సైడ్ డోర్స్, సేఫ్టీ మెష్‌లు మచ్చుకైనా కనిపించవు. వీటిలో అనేక ఆటోలు ఫిట్‌నెస్‌కు ఆమడ దూరంలో ఉంటున్నాయి. వీటి డ్రైవర్లూ ఆర్టీఏ నిర్ధేశించిన ప్రకారం ఉండట్లేదు. మరోపక్క తమ స్కూలుకు విద్యార్థులను తరలిస్తున్న ఆటోల వివరాలు, వాటి డ్రైవర్ల వ్యవహారం యాజమాన్యాలకు అసలే పట్టదు. ఈ నేపథ్యంలో భావి పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సుల మాదిరి స్కూలు ఆటోలకూ ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి.

 
‘ట్రాన్స్‌పోర్ట్ కంపల్సరీ’కి ఏమిటీ అడ్డంకి?

నగరంలో ఉన్న ‘ఖరీదైన’ స్కూళ్లకు మినహా మిగిలిన వాటికి సొంత రవాణా వ్యవస్థ లేదు. పేరెన్నికగన్న పాఠశాలలు సైతం ఈ విషయంలో తమకెందుకన్నట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో సొంతంగా రవాణా సౌకర్యాన్ని కల్పించిన కొన్ని స్కూళ్లు ఇప్పుడు దాన్ని విస్మరించాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 3 వేలకు పైగా స్కూళ్లు ఉండగా... ఆర్టీఏ లెక్కల ప్రకారం కేవలం వెయ్యి స్కూల్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే... స్కూలుకు ఒక బస్సు లెక్కన వేసుకున్నా రెండు వేలకు పైగా స్కూళ్లకు లేవన్నమాట. ఫలితంగానే తల్లిదండ్రులు విద్యార్థులను ఆటోలు తదితర వాహనాల్లో పాఠశాలలకు పంపించాల్సి వస్తోంది. ప్రతి స్కూలు తమ దగ్గర చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టు ఫెసిలిటీ కల్పించాలన్నది కచ్చితం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు తదితరులు సొంతంగా తీసుకువచ్చి దింపే విద్యార్థులు మినహా మిగిలిన వారు స్కూలు బస్సుల్లోనే ప్రయాణించడం కచ్చితం చేయాలని కోరుతున్నారు.

 
ఫెయిర్‌గా లేని ఆటోఫేర్...

ఇక ట్రాఫిక్ పోలీసులు... అనునిత్యం ఆటోవాలాల చేత దోపిడీకి గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల విషయం కూడా ఆలోచించట్లేదు. స్కూలు పిల్లలను తరలించే ఆటోల డ్రైవర్లు దూరంతో నిమిత్తం లేకుండా భారీగా దండుకుంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో వచ్చే సెలవులతో తమకు సంబంధం లేదని, మొత్తం అన్ని నెలలకూ చెల్లించాల్సిందే అంటూ వసూలు చేస్తున్నారు.

 
అది రాయాల్సిన అవసరం లేదా?

స్కూలు బస్సుల విషయంలో ఆర్టీఏ అధికారులు వివిధ నిబంధనలు వల్లెవేస్తారు. వాటికి కచ్చితంగా ఫలానా రంగే ఉండాలని, దానికి ముందు వెనుక స్కూల్ బస్సు అని రాయాలని, సదరు స్కూలు ఫోన్ నెంబర్ కచ్చితంగా కని పించాలని... ఇలా ఎన్నో నిబంధనలున్నాయి. వాటిని ఇతర వాహనచోదకులు గుర్తించి జాగ్రత్తగా మెలగాలని, ఏదైనా జరగరానిది జరిగితే సమాచారం అందించడానికి అవసరమని వీటిని విధించారు. అయితే స్కూలు ఆటోల విషయంలో మాత్రం వీటిని పట్టించుకోవట్లేదు. సదరు ఆ టోలు విద్యార్థులను తరలిస్తున్న సమయంలో అయినా ఆ విషయం సూచించేలా ముందు వెనుక చిన్న బోర్డులు ఏ ర్పాటు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.


మాఫియాపై ఎవరిని ఆశ్రయించాలి?
ఎవరైనా ప్రయాణికుడు ఓ ఆటోను ఫలానా చోటుకు రమ్మని పిలిస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే. అలా కాని పక్షంలో సదరు ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆటో రిఫ్యూజల్ కింద జరిమానా విధిస్తారు. అయితే స్కూలు ఆటోల డ్రైవర్లు సాగిస్తున్న ‘మాఫియా’ వ్యవహారాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలనేది స్పష్టంగా లేదు. ఓ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు మాఫియాగా మారుతున్నారు. అక్కడున్న విద్యార్థిని ముందు ఓ ఆటోలో పంపించి... భద్రత నేపథ్యంలోనో, మరో కారణంగానో వేరే ఆటోకు మార్చాలని భావిస్తే అది గగనమే. దీనికి పాత ఆటో డ్రైవర్ అంగీకరించడు. కొత్తగా వస్తున్న వ్యక్తిని బెదిరించి మరీ తన కస్టమర్‌ను ‘కాపాడుకుంటాడు’. ఇది నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న పరిస్థితే అయినా... ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాల్లో ఎవరూ పట్టించుకోక... ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థకాక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు.

 

ఆటోలపై చర్యలు తీసుకోవాలి
ఫిట్‌నెస్ లేని స్కూలు బస్సులను సీజ్ చేస్తూ, లెసైన్స్ లేని డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకుంటున్న సంబంధిత అధికారులు ఆటోవాలాలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి. పరిమితికి మించి స్కూలు పిల్లల్ని ఆటోల్లో తీసుకెళ్తున్నారు. దీని ద్వారా ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. అంతే కాకుండా ఒకరి ఏరియాలోకి మరో ఏరియా ఆటోను కూడా రానివ్వకుండా చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక తమ పిల్లలను ఇరుకిరుకుగా కూర్చోబెట్టి స్కూళ్లకు పంపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఫిట్‌నెస్ లేని ఆటోలు, లెసైన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నవారు, పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి.      - భవానీ, అడ్డగుట్ట

 
ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలి

నగరంలో చాలా మంది స్కూలు ఆటోలు నడుపుతుంటారు. వారందరూ వారి ఇష్టారాజ్యంగా ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకొని దానికి తోడు పిల్లల బ్యాగులు కూడా ఆటోకు ఇరువైపులా వేసుకొని ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటారు. అదుపు తప్పితే ఎన్నో ఘోరాలు జరిగే అవకాశాలున్నాయి. రూల్స్‌కు వ్యతిరేకంగా పరిమితికి మించి పిల్లల్ని ఆటోల్లో ఎక్కించుకొని ప్రమాదంతో ఆటలాడుతున్నారు. అందువల్ల వారందరికీ సంబంధిత అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించాలి. అప్పుడే ఆటో వాలాలు సక్రమంగా నడుచుకుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా చేయకుండా అధికారులు ముందే చర్యలు తీసుకుంటే బాగుంటుంది.  - నాగభూషణం, అడ్డగుట్ట

 

స్కూల్ బస్సులే బెస్ట్...
ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు.. ఒక్కోసారి రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. స్కూల్ ఆటోలు సైతం 12 నుంచి 15 మంది వరకు ఎక్కిస్తుంటారు. అందుకే మా పిల్లలను స్కూల్ బస్సులోనే పంపిస్తున్నాం. ప్రస్తుతం మా అమ్మాయి చింతల్ సెయింట్ మార్టిన్స్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతుండగా నర్సరీ నుంచి స్కూల్ బస్సులోనే పంపుతున్నాం.   - కవిత, చింతల్

 

అమ్మో..ఆటోలా...
మా అబ్బాయి నుమాన్ పద్మానగర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న శ్రీనిధి స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. మొదట్లో ఆటోలో పంపించేవాళ్లం. అయితే ఎక్కువ మంది పిల్లలను ఆటోలో ఎక్కిస్తున్నారు. దీంతో 2 కిలోమీటర్ల దూరమైనా తామే పాఠశాలలో దింపి మళ్లీ తీసుకు వస్తున్నాం. ఆటోలను ఆశ్రయించాలంటేనే భయంగా ఉంది.  - హస్మ, కుత్బుల్లాపూర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement