బంధాల్లేని ‘మనీ’షి!
* ఆస్తి కోసం అఘాయిత్యాలు
* అయిన వారినే హతమారుస్తున్న వైనం
* భూముల ధరల వెంటే పెరుగుతున్న వివాదాలు
* ఆందోళన కలిగిస్తున్న నేరాలు
కామారెడ్డి: పేగుబంధం పరిహాసమవుతోంది.. మానవత్వం మంట గలుస్తోంది.. మనిషి చుట్టూ తిరగాల్సిన బంధాలు, అనుబంధాలు.. ప్రస్తుతం ‘మనీ’ చుట్టూ తిరుగుతున్నాయి. ఆస్తి కోసం అయిన వారినే చంపే పరిస్థితులు దాపురించాయి.
రక్తం పంచిన వారు, తోడ బుట్టిన వారే పొట్టన బెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. భూమి, ఆస్తి, డబ్బు వంటి ఆర్థిక పరమైన వ్యవహారాలు ప్రాణాలు బలిగొంటున్నాయి. భూముల విలువలు పెరిగిన కొద్దీ అదే స్థాయిలో వివాదాలు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో హత్యలకు దారి తీస్తున్నాయి. రెండ్రోజుల క్రితం తాడ్వాయి మండలం ఎర్రపహడ్‌లో చోటు చేసుకున్న ఉదంతమే అందుకు నిదర్శనం. ఆస్తి విషయంలో తాగాదాతో అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు, కిరాతకంగా సోదరుడి గొంతు కోసి హతమార్చడం సంచలనం సృష్టించింది.
మాయమవుతున్న బంధాలకు ‘మచ్చ’తునకగా నిలిచింది. భూములు, ఆస్తుల విషయంలో తలెత్తుతున్న గొడవలను సామరస్యంగా కూర్చుండి పరిష్కరించుకోవడమో, లేదా కోర్టుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించుకుండా కక్షలు పెంచుకుని దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఆవేశంతో హత్యలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. ఫలితంగా అటు హతుల కుటుంబాలు, ఇటు హంతకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
విలువలతో పాటే పెరుగుతున్న వివాదాలు
పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా భూముల ధరలు అమాంతం పెరుగుతుండడంతో వివాదాలూ పెరుగుతున్నాయి. గెట్టు విషయంలో, వాటా విషయంలో తలెత్తుతున్న విభేదాలు, ఆస్తి పంపకాల్లో తేడాలు దాడు లు, ప్రతిదాడులకు దారి తీస్తున్నాయి. హంతకులుగా మారుస్తున్నాయి. ఆస్తి పంచుకున్నపుడు అందరూ ఇష్టంగానే పంచుకున్నా, తరువాత పెరిగిన ధరలతో విభేదాలు ఏర్పడి వివాదాలకు కారణమవుతున్నాయి.
బంధాలకు విలువేది..?
ఆస్తి కోసం అయిన వారినే హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి తన వారినే మట్టుబెట్టడం మంట గలుస్తున్న అనుబంధాలకు మచ్చగా మిగులున్నాయి. అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ, అనురాగాలు ఉండాల్సింది పోయి పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులకు దిగడం, హత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. మనిషిలో పెరిగిన స్వార్థం, అత్యాశ, డబ్బు వ్యామోహమే వివాదాలు, ఘర్షణలు, హత్యలకు కారణమవుతున్నాయి.
మాయని ‘మచ్చ’లెన్నో
♦ తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ గ్రామం వద్ద శనివారం రాత్రి కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన శెట్కూరి అమర్ (26)ను సొంత తమ్ముడే కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటనకు ప్రధాన కారణం భూ తగాదాలేనని స్పష్టమైంది. వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన విబేధాలతో అన్నను హతమార్చిన తమ్ముడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
♦ కామారెడ్డిలో గతేడాది ఏప్రిల్ 30న నాగరాజు (34) తన తండ్రి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తడంతో తండ్రి సిద్దరాములు పథకం ప్రకారం మరొకరితో కలిసి నాగరాజును హతమార్చాడు.
♦ తాడ్వాయి మండల కేంద్రంలో ఆరు నెలల క్రితం అన్నదమ్ముల మధ్య మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి డబ్బు కోసం జరిగిన గొడవలో నామాల శ్రీనివాస్ (26)ను అతని అన్న రమేశ్ హతమార్చాడు. తమ్ముడు కటకటాల పాలయ్యాడు.