
అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాం: భూమా
విజయవాడ: రాష్ట్రంలో రాజకీయ పరిస్థుతులు, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తనకు తెలియదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార టీడీపీలో చేరామని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. తనతో కలిపి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు.
'గడిచిన 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉంటున్నా. ఇన్నేళ్ల కాలంలో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజవకవర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని నేను నమ్మాను. కార్యకర్తలు కూడా అదే మాట నాతో చెప్పారు. చంద్రబాబుతో కలిసి పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకే టీడీపీలో చేరుతున్నాం'అని భూమా విలేకరులతో చెప్పారు.
చంద్రబాబు నుంచి ఎలాంటి మంత్రిపదవి హామీ లభించలేదని, కేవలం అభివృద్ధి కోసమే అధికారపార్టీలో చేరానన్న నాగిరెడ్డి.. తమ రాకతో టీడీపీ బలపడుతుందేకానీ నిర్వీర్యంకాదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయం పై తర్వాత ఆలోచిస్తానన్న ఆయన.. విపక్షం నుంచి ఇంకా ఎవరుచేరతారో చెప్పలేనన్నారు. వైరివర్గాలతో సర్దుబాట్ల విషయమై చంద్రబాబు సూచనలు చేశారని, కలిసి ముందుకుసాగుతూ టీడీపీ ఉన్నతికి కృషిచేస్తానని భూమా నాగిరెడ్డి అన్నారు. ఆయనతోపాటు కుమార్తె అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు కూడా టీడీపీలో చేరారు.
'ఆళ్లగడ్డ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను. 20 ఏళ్లుగా ఆళ్లగడ్డ అభివృద్ధికి నోటు కోలేదు. అందుకే పార్టీ మారుతున్నాం' అని భూమా అఖిల ప్రియ అన్నారు. 'రెండు సంవత్సరాలుగా నా నియోజక వర్గంలో ఒక్క పని జరగలేదు. పనులు అవుతాయనే టీడీపీలో చేరాను' అని జలీల్ ఖాన్ తెలిపారు.
'చాలా రోజులుగా టీడీపీలో చేరాలనుకుంటున్నా. స్థానిక నాయకత్వం విభేధించడం వల్ల..ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది' అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.