ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
ఉండి : ఉండి ఇరిగేషన్ కార్యాలయాన్ని గురువారం వెలివర్రు గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు ముట్టడించారు. గ్రామంలోని కుమ్మరకోడు, మాలకోడు డ్రెయిన్ల తవ్వకానికి వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను ఇరిగేషన్ అధికారులు సీజ్ చేయడంతో వారు ఆందోళనకు దిగారు. వెలివర్రు గ్రామంలోని కుమ్మరకోడు, మాలకోడుల కింద దాదాపు 100 ఎకరాలు సాగులో ఉంది. అయితే వీటి తవ్వకంలో కొన్నేళ్లుగా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి హామీ పథకంలోనైనా పనులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు చందాలు వేసుకుని డ్రెయిన్ల తవ్వకాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు తమ ఆధ్వర్యంలో డ్రెయిన్లను తవ్విస్తామని హామీ ఇచ్చి తవ్వకాలను నిలిపివేయించారు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదుతో అధికారులు గురువారం ఉదయం తవ్వకానికి ఉపయోగిస్తున్న పొక్లయినర్‌ను సీజ్ చేశారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఉండి ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ముదునూరి కొండరాజు, బీజేపీ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.