ఆస్తి కోసమే తోడల్లుడిని హతమార్చారు | four arrest of murder case | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసమే తోడల్లుడిని హతమార్చారు

Published Wed, Jun 7 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

ఆస్తి కోసమే తోడల్లుడిని హతమార్చారు

ఆస్తి కోసమే తోడల్లుడిని హతమార్చారు

– నలుగురు నిందితుల అరెస్ట్‌
– సాంకేతిక ఆధారాలతో కేసును చేధించిన పోలీసులు


నల్లమాడ (పుట్టపర్తి) : ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే విషయం మరోసారి రుజువైంది. నల్లమాడ మండలం గోపేపల్లి పొలిమేరల్లోని ప్రధాన రహదారిపై గత నెల 29న ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండగా పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు తెలిపారు. నల్లమాడ ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ గోపీతో కలసి నిందితులను మీడియా ముందు బుధవారం హాజరుపరిచారు. గుర్తు తెలియని మృతదేహం కదిరి మండలం బత్తలపల్లి తండాకు చెందిన రవికుమార్‌నాయక్‌(38)దిగా గుర్తించారు. తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అనుమానంతో విచారణ చేపట్టిన పోలీసులు హత్య కేసులో ప్రధాన నిందితుడు ముదిగుబ్బకు చెందిన ఇస్లావత్‌ తిరుపాల్‌ నాయక్, బాలరాజునాయక్, ఎస్‌.బాలాజీనాయక్, ఎన్‌.నాగేంద్రనాయక్‌ను అరెస్ట్‌ చేశారు. తిరుపాల్‌నాయక్, హత్యకు గురైన రవికుమార్‌నాయక్‌ తోడల్లుళ్లు. వీరిద్దరూ ఒకే ఇంటికి చెందిన అక్కా,చెల్లెళ్లను పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి మామ ప్రభుత్వోద్యోగిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. హిందూపురం, అనంతపురం, ధర్మవరం, కదిరిలో అతని పేరుతో స్థలాలున్నాయి. తోడల్లుడిని అడ్డు తొలగించుకుంటే అత్తవారి ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని తిరుపాల్‌నాయక్ ఆలోచించాడు. వెంటనే రవికుమార్‌నాయక్‌ హత్యకు పథకం రచించాడు.

తనకు పరిచయమున్న రమేష్‌నాయక్‌కు ఫోన్‌ చేసి రవికుమార్‌నాయక్‌ను ముదిగుబ్బకు పిలిపించుకున్నాడు. గత నెల 29వ రాత్రి ముదిగుబ్బ సమీపంలోని ఓ డాబాలో రవికుమార్‌నాయక్‌కు బాగా మద్యం తాపించాడు. ఆ తరువాత రమేష్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. అనంతరం తిరుపాల్‌నాయక్‌ తన బంధువులు, స్నేహితులైన బాలరాజునాయక్, బాలాజీనాయక్, నాగేంద్రనాయక్‌తో కలసి రవికుమార్‌నాయక్‌ను కారు(నెంబర్. కేఏ 01ఎంహెచ్‌ 8240)లో ఎక్కించుకున్నారు. గోపేపల్లి పొలిమేర వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న రవికుమార్‌నాయక్‌ను కారులో నుంచి బయటకు నెట్టేసి అతని శరీరంపై కారును వెనుకా, ముందుకు పలు దపాలు తొక్కించారు. చనిపోయాడనుకుని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు.

మరుసటి రోజు ఉదయం ప్రధాన నిందితుడు తిరుపాల్‌నాయక్‌ మృతుని భార్య,పిల్లలతో కలసి కదిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు ఎవరిపైనా అనుమానం లేదని, రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉండొచ్చని మృతుని కుటుంబ సభ్యులతో పోలీసులకు చెప్పించాడు. దీంతో పోలీసుల్లో అనుమానం మరింత బలపడింది. మృతదేహం వద్ద లభ్యమైన కారు మడ్‌గార్డ్‌ రేకు, కదిరి, ముదిగుబ్బలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వారు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. మలకవేమల–ముదిగుబ్బ రహదారిలో కల్వర్టు వద్ద బుధవారం నిందితులను అరెస్ట్‌ చేసి కదిరి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.  కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్‌ఐ సహా సిబ్బంది రాధాకృష్ణగౌడ్, హర్షవర్దన్‌రాజు, నారాయణస్వామి, రాము, శంకర్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు. కాగా ప్రధాన నిందితుడు తిరుపాల్‌నాయక్‌ మొదటి భార్య ముదిగుబ్బ మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌ అని తెలిసింది. ప్రస్తుతం వీరు అధికార పార్టీలో కొనసాగుతున్నారు. భార్య ఉండగానే తిరుపాల్‌నాయక్‌ రెండో వివాహం చేసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement