నలుగురు జలసమాధి
ఆ తల్లిదండ్రులు బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తమ సర్వస్వం వారే అన్నట్లు బతికారు. ఇద్దరు ఆడపిల్లలు.. ఒక కుమారుడు. పీర్ల పండుగకు సంతోషంగా గడిపేందుకు నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. విధి విషం చిమ్మినవేళ అక్కడ ముగ్గురు ప్రమాదవశాత్తూ కాలువలో పడి జలసమాధి అయ్యారు. వారితో పాటు మరో చిన్నారి మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామానికి చెందిన షేక్ చిన్నసైదులు కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.
దేచుపాలెం (వత్సవాయి) : ముగ్గురు బిడ్డలూ మృత్యుఒడికి చేరడంతో తమకు దిక్కెవరంటూ దేచుపాలెం గ్రామానికి చెందిన షేక్ చిన్నసైదులు, ఫకీరాబీ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సిద్దాబీ (20), అస్నాబీ (14), ముస్తఫా (10). ఈ ఏడాది మే నెలలో పెద్ద కుమార్తె సిద్దాబీకి వివాహం చేశారు. చిన్న కుమార్తె అస్నాబీ మంగ్లొలులోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి, కుమారుడు ముస్తఫా గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నారు. చిన్నసైదులు గొర్రెల కాపరిగా పనిచేస్తుండగా, ఫకీరాబీ కూలి పనులకు వెళుతుంది. పీర్ల పండుగకని అమ్మమ్మ గ్రామమైన నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి ఆదివారం వీరు ముగ్గురు వెళ్లారు. మంగళవారం ఉదయాన్నే బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోనే ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు సిద్దాబీ బయలుదేరగా, ఆమెతో పాటు అస్నాబీ, ముస్తపా, వాళ్లకు తమ్ముడు వరసయ్యే ఖమ్మం అర్బన్ మండలం శ్రీనివాసనగర్‌కు చెందిన షేక్ రియాజ్ కూడా వెళ్లాడు. సిద్దాబీ బట్టలు ఉతుకుతుండగా ముస్తపా, రియాజ్ కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి, కలిసి కాలువ ఒడ్డు వద్ద దిగారు. అక్కడ పాచిపట్టి ఉండడంతో ఇద్దరికీ కాలు జారి కాలువలో లోతుకు వెళ్లిపోయారు. గమనించిన అస్నాబీ తమ్ముళ్లను కాపాడే ప్రయత్నంలో కాలువలో పడింది. ముగ్గురూ కాలువలో పడి కొట్టుకుపోవడాన్ని చూసిన సిద్దాబీ వారిని కాపాడే ప్రయత్నంలో కాలువలో పడి మునిగిపోయింది. దీంతో నలుగురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ఉదయభాను, రాజగోపాల్ పరామర్శ..
మృతుల కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.