ప్రేమించి పెళ్లాడతానని మోసం
ప్రేమించి పెళ్లాడతానని మోసం
Published Mon, Jun 5 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
అర్ధరాత్రి గోదావరిలోకి తోసేసి పరారైన ప్రియుడు
యువతిని రక్షించిన మత్స్యకారులు
యానాం (ముమ్మిడివరం) : ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, అనంతరం ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించాడు ఓ వ్యక్తి. ప్రియురాలిని గోదావరిలోకి తోసేసి పరారైన ఓ వ్యక్తి ఉదంతమిది. బాధితురాలి కథనం ప్రకారం రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ పనస చెట్టు సందుకు చెందిన గండి అలివేణి , నాసిక శ్రీనివాసరావు ఇద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అలివేణి ఉప్పలగుప్తం మండలం సూరసేన (ఎస్)యానాంలో కెయిర్న్ ఎనర్జీలో ఎక్సెస్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో సొంతంగా వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం బైక్‌పై అలివేణి వద్దకు శ్రీనివాస్ ఎస్.యానాం వచ్చాడు. ఈ నేపథ్యంలో పెళ్లి ప్రస్తావనను అలివేణి తీసుకువచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. పెళ్లికి కులం అడ్డుపడుతుందనే కోణంలో కొంత కాలంగా వీరిద్దరి మధ్య విషయం జరుగుతోంది. ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయంలో వివాహం చేసుకుందామని చెప్పడంతో వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి అమలాపురంలో భోజనం చేసి అనంతరం బయలు దేరారు. యానాం ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు వచ్చేసరికి ఇద్దరూ కలిసి వంతెన వద్ద ఆగారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు అలివేణిని బలవంతంగా కొట్టి పీక నులిమి బ్రిడ్జిపై నుంచి తోసేసి పరారయ్యాడు. తెల్లవారు జాము కావడంతో వీరబాబు అనే వ్యక్తి, మత్స్యకారులు ఆమె కేకలు విని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద వార్తను తెలుసుకున్న ఐపోలవరం ఎస్‌ఐ టి.క్రాంతికుమార్ బాధితురాలి వాంగ్మూలం విని కేసు నమోదు చేశారు.
పెళ్లి పేరిట మోసగించాడు
అలివేణిని పెళ్లి చేసుకుంటానని ఎన్నో ఏళ్లుగా శ్రీనివాసరావు చెబుతూ వస్తున్నాడని, కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోరనే వాడని అలివేణి స్వయానా పెద్ద అక్కలు అనూరాధ, అరుణకుమారి, బావ శీలం కోటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. యానాం జీజీహెచ్ వద్ద వారు మాట్లాడారు. అలివేణి తండ్రి అర్జునరావు గతంలో మృతి చెందగా తల్లి గండి కుమారి వద్ద వుంటుందన్నారు.
Advertisement
Advertisement