దసరాకు కిక్కే కిక్కు!!
దసరాకు కిక్కే కిక్కు!!
Published Sun, Oct 9 2016 3:10 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
* 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ ఒత్తిడి
* మద్యం దుకాణాల్లో ఫుల్‌గా స్టాక్
* ప్రభుత్వ చర్యతో విస్తుపోతున్న వ్యాపారులు
నరసరావుపేట టౌన్ : దసరా పండుగకు కిక్కును పెంచేందుకు అబ్కారీ శాఖ సంసిద్ధమైంది. వరుసగా సెలవులు రావడంతో అమ్మకాలు పెంచాలంటూ వ్యాపారులపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. గత ఏడాదికంటే ఈ ఏడాది 20 శాతం అధికంగా విక్రయాలు చేపట్టాలంటూ టార్గెట్ విధించింది. దీంతో మద్యం దుకాణాల్లో స్టాక్ ఫుల్‌గా దర్శనమిస్తోంది. వివరాల్లో కెళితే... ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు పండుగలను సైతం అక్రమ మార్గంలో వినియోగించుకొంటున్నారు. డివిజన్‌లో 50 బార్ అండ్ రెస్టారెంట్‌లు, 180 వైన్‌షాపులు ఉన్నాయి. అక్టోబర్‌లో వరుసగా దసరా, మొహర్రం, దీపావళి పండుగలు వచ్చి సెలవులు రావడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావించింది. దీంతో గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన అమ్మకాల కంటే 20 శాతం అధికంగా ఆదాయం సమకూరాలని అధికారులకు ఆదేశాలు జారిచేసినట్టు తెలిసింది. అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నెలలో అమ్మకాల శాతం పెంచాలని హుకుం జారీ చేశారు. చేసేదేమీ లేక వ్యాపారులు సాధారణంగా కొనుగోలు చేసే స్టాక్‌కు అదనంగా మరో 20 శాతం ఎక్కువ నగదుతో డీడీలు చెల్లించి స్టాక్‌ను తీసుకున్నారు. దీంతో ప్రతి మద్యం దుకాణంలో స్టాక్ ఫుల్‌గా దర్శనమిస్తోంది. సొంత ఊళ్లకు వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని ఈనెలలో ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఒత్తిడితో బెంబేలు..
ఈ నెలలో ఆదాయం పెంచాలని మద్యం వ్యాపారులపై అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే గతనెలలో ఆశించిన మేర అమ్మకాలు లేక దుకాణాల్లో స్టాక్ ఫుల్‌గా ఉన్న నేపథ్యంలో అధికారుల ఒత్తిడి కారణంగా కొందరు వ్యాపారులు అప్పులు తీసుకొచ్చి మరీ స్టాక్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ పండుగల వేళల్లో కూడా మద్యం ఏరులైపారే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తోంది.
Advertisement